సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఫిరాయింపుల ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. పెండింగ్‌లో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఒకరైన.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ బుధవారం నోటీసులు జారీ చేశారు. ఈ నెల 30వ తేదీన తన ఎదుట విచారణకు హజరు కావాలని నోటీసుల్లో ఆయన పేర్కొన్నారు.
కారు గుర్తుపై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారంటూ బీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే స్పీకర్ చర్యలకు తీసుకోవడం లేదంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో కోర్టు డెడ్‌లైన్‌లు, వార్నింగ్‌లతో స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ చేపట్టారు. ఇప్పటికే ఏడుగురిని విచారించిన స్పీకర్.. వాళ్లు పార్టీ మారినట్లు ఆధారాల్లేవంటూ పిటిషన్లు కొట్టేస్తూ తీర్పు ఇచ్చారు. అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్యలకు క్లీన్ చిట్ ఇచ్చారు.
ఈ క్రమంలో మిగిలిన ముగ్గురు డాక్టర్ సంజయ్, దానం నాగేందర్, కడియం శ్రీహరిలను విచారణ జరపాల్సి ఉంది. అయితే హఠాత్తుగా ఎమ్మెల్యే దానం నాగేందర్‍కు తాజాగా నోటీసులు ఇచ్చారు. అలాగే దానం నాగేందర్ పై అనర్హత పిటిషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సైతం స్పీకర్ నోటీసులు ఇచ్చారు. వీరిద్దరు ఈ నెల 30న విచారణకు హాజరుకావాలని వేర్వేరుగా ఇచ్చిన నోటీసులలో పేర్కొన్నారు.
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విషయంలో చేస్తున్న జాప్యంపై ఈనెల 19వ తేదిన స్పీకర్ కు సుప్రీంకోర్టు కోర్టు ధిక్కర నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్లపై చర్యలు తీసుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించించింది. ఈ నేపథ్యంలో నాగేందర్‌కు స్పీకర్ నోటీసులు ఇవ్వడం ఆసక్తిగా మారింది. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ పై ఎంపీగా పోటీ చేయడం తెలిసిందే.


