‘బనకచర్ల’పై చర్చిద్దాం రండి | State government to seek everyones opinions and suggestions on Banakacharla project | Sakshi
Sakshi News home page

‘బనకచర్ల’పై చర్చిద్దాం రండి

Jun 18 2025 1:00 AM | Updated on Jun 18 2025 1:00 AM

State government to seek everyones opinions and suggestions on Banakacharla project

రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, అధికార, విపక్ష ఎంపీలకు సర్కారు విజ్ఞప్తి

ఫోన్లు, లేఖల ద్వారా ఆహ్వానించిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

నేటి సాయంత్రం సచివాలయంలో భేటీ.. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌

ఏపీ ప్రాజెక్టుకు అనుమతులివ్వకుండా కేంద్రంపై ఒత్తిడికి కార్యాచరణ సిద్ధం చేసే యోచన

అందరి అభిప్రాయాలు, సలహాలను కోరనున్న రాష్ట్ర ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ చేపడుతున్న గోదావరి –బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టును తీవ్రంగా ప్రతిఘటించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణ యించింది. ఆ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమ తులు జారీ చేయకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే అంశంపై ..రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులతో పాటు అధికార, విపక్ష పార్టీల లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల అభిప్రాయాలు, సలహాలను స్వీకరించి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి బుధవారం సాయంత్రం 4 గంటలకు సచి వాలయంలో రాష్ట్రానికి చెందిన లోక్‌సభ, రాజ్య సభ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వ హించనున్నారు. 

సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొననున్న ఈ సమా వేశానికి గౌరవ అతిథు లుగా హాజరు కావాలని కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజ య్‌లకు మంత్రి ఉత్తమ్‌ స్వయంగా ఫోన్‌ చేసి ఆహ్వానించారు. అందు బాటులో ఉన్న ఇతర ఎంపీలకు సైతం ఆయన ఫోన్‌ చేసి ఆహ్వానించారు. రాష్ట్రం నుంచి ఎంపికైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎం ఎంపీలందరికీ ఆహ్వాన లేఖలను పంపించారు. 

అడ్డుకునే వ్యూహంపై చర్చిద్దాం
గోదావరి ట్రిబ్యునల్‌ తీర్పుతో పాటు రాష్ట్ర పున ర్విభజన చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఈ నెల 3న ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ను.. సీఎం రేవంత్‌రెడ్డి, తాను కలిసిన విషయాన్ని ఎంపీలకు రాసిన లేఖల్లో మంత్రి ఉత్తమ్‌ గుర్తుచేశారు. అంతేకాకుండా సీఆర్‌ పాటిల్‌కు తాను లేఖ సైతం రాశానని తెలిపారు. 

అయితే ఏపీ నుంచి ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు ఇంకా అందలేదని, అందిన తర్వాత తమ శాఖ పరిధిలోని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)..అమల్లో ఉన్న నిబంధనలు, ట్రిబ్యునళ్ల తీర్పులు, అంతర్రాష్ట్ర జల ఒప్పందాలతో పాటు ఏపీ పునర్విభజన చట్టంలోని నిబంధనల ఆధారంగా పరిశీలన జరిపి నిర్ణయం తీసుకుంటుందంటూ పాటిల్‌ హామీ ఇచ్చారని వివరించారు. 

కాగా ప్రాజెక్టు ప్రీఫీజిబిలిటీ రిపోర్టును తిరస్కరించాలని కోరుతూ ఈ నెల 13న సీఆర్‌ పాటిల్‌కు మళ్లీ తాను లేఖ రాసినట్టు ఉత్తమ్‌ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాజెక్టును అడ్డుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించడానికి బుధవారం సచివాలయంలో సమావేశం నిర్వహించనున్నట్టు వెల్లడించారు. 

బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఎంపీలు వస్తారా?
తెలంగాణకు నష్టం కలిగించనున్న గోదావరి– బనకచర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభు త్వానికి లేఖ రాయాలని సీఎం రేవంత్‌రెడ్డికి తాజాగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సూచించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ సమర్పించిన ప్రతిపాదనలపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. మరోవైపు ఈ ప్రాజెక్టును అడ్డుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫల మైందని బీఆర్‌ఎస్‌ గత కొంత కాలంగా ఆరోప ణలు చేస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం మంత్రి ఉత్తమ్‌ నిర్వహించనున్న సమావేశానికి బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఎంపీలు వస్తారా? అనే అంశం ఆసక్తికరంగా మారింది.  

Advertisement
 
Advertisement
Advertisement