నాలుగు రోజులకోసారి దావత్‌ ఇవ్వాల్సిందే..! | Hanamkonda ASI Accused Of Misbehaving With Police Staff | Sakshi
Sakshi News home page

నాలుగు రోజులకోసారి దావత్‌ ఇవ్వాల్సిందే..!

Jul 21 2026 1:56 PM | Updated on Jul 21 2026 2:05 PM

Hanamkonda ASI Accused Of Misbehaving With Police Staff

ప్ర‌తీకాత్మ‌క చిత్రం (ఏఐ ఫోటో)

వరంగల్‌ క్రైం: హనుమకొండ సబ్‌ డివిజన్‌ పరిధిలోని ఓ పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న  ఏఎస్‌ఐ పెత్తనం హద్దులు దాటిపోయింది. బీటెక్, ఎంబీఏలు చేసి కానిస్టేబుల్‌ ఉద్యోగం సాధించిన యువ సిబ్బందిని నిత్యం మాటలతో నరకం చూపిస్తున్న ఆ ఏఎస్‌ఐ హంగామాను ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో సిబ్బంది ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఓ బలమైన సామాజిక వర్గానికి చెందిన సదరు అధికారి తాను చెప్పిందే వేదం, లేదంటే డ్యూటీలు మారుస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత చదువులు చదువుకొని కానిస్టేబుల్‌ ఉద్యోగం చేస్తున్న సిబ్బందిని ఏంట్రా.. ఏందే అని పిలుస్తారని చెబుతున్నారు. మహిళా సిబ్బంది ‘ఇదేంటి సార్‌.. ఇలా మాట్లాడుతారు’ అని ప్రశ్నిస్తే.. ‘ఎంటి బిడ్డ.. నీ తండ్రిలాంటి వాడిని’ అని వెంటనే మాట మారుస్తారని అంటున్నారు.  

అధికారులకు కాసులు.. సిబ్బందికి చీవాట్లు
ఈ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుల్లో 60 శాతం ఎంక్వయిరీ ఈయనకే రాస్తారు. ఫిర్యాదుదారులను నయానో భయానో బెదిరించి పెద్ద మొత్తంలో వసూలు చేసి అధికారులకు కాసులు కురిపిస్తాడని, అందుకే ఇతర అధికారులు ఎంత మంది ఉన్నా ఈయనకే పిటిషన్లు అప్పజెప్పుతారన్న ఆరోపణలున్నాయి. కొందరు కానిస్టేబుళ్లు ఆయనకు నాలుగు ఐదు రోజులకోసారి దావత్‌ ఇవ్వాలి.. లేదంటే మాటలయుద్ధం మొదలు పెడతాడని తెలుస్తోంది. ఇక.. స్టేషన్‌కు వచ్చే పిటిషన్లపై ఆరా తీస్తూ తనకు సంబంధం లేకున్నా అందరికి ఫోన్లు చేసి కలవాలని హుకుం జారీ చేస్తున్నట్లు సమాచారం. ఫిర్యాదుదారులపై తన నోటి ప్రతాపం చూపిస్తాడనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

 ఒక్కో సమయంలో ఆయన పోలీస్‌ స్టేషన్‌లో ఉన్నాడంటే ఫిర్యాదుదారులు రావటానికి జంకుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఒకవైపు స్టేషన్, మరోవైపు తన పై అధికారుల పనులు చక్కబెట్టడంతో ఆయన ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లు  తయారైంది. స్టేషన్‌ అధికారుల పేరు చెప్పి కేసులను తనకు అనుకూలంగా సెటిల్‌ చేయడంలో సిద్ధహస్తుడనే పేరుంది. నిత్యం తన నోటి దురుసుతో వ్యవహరిస్తున్న ఆ అధికారి పెత్తనానికి అడ్డూఅదుపు లేకుండా పోయింది. ఆయనపై ఉన్నతాధికారులు విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారులు, సిబ్బంది కోరుతున్నారు.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement