రాష్ట్రమంతటా విస్తరించిన నైరుతి
వేగంగా మారుతున్న వాతావరణం
తగ్గిన ఉష్ణోగ్రతలు
నేడు, రేపు మోస్తరు వర్షాలు
15 జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఈనెల 1 నుంచి 23వ తేదీ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 97.4 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... 81.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే 16 శాతం లోటు ఉన్నట్లు రాష్ట్ర ప్రణాళిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి
సాక్షి, హైదరాబాద్
నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించాయి. ఈనెల 8వ తేదీన రాష్ట్ర భూభాగాన్ని తాకిన రుతుపవనాలు క్రమంగా ముందుకు సాగి మంగళవారం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించాయి. సాధారణంగా రుతుపవనాలు ప్రవేశించిన వారం రోజుల వ్యవధిలో రాష్ట్రమంతటా విస్తరిస్తాయి. గతేడాది కేవలం 4 రోజుల్లోనే విస్తరించగా... ఈసారి రెండు వారాల సమయం పట్టింది. రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించినప్పుడు చురుకుగానే కదిలినప్పటికీ... ఆ తర్వాత నెమ్మదించడంతో జాప్యం నెలకొందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రమంతటా విస్తరించడంతో పాటు చురుకుగా కదులుతుండడంతో వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
బిహార్... జార్ఖండ్ వరకు
రుతుపవనాల కదలికలతో రాష్ట్రంలో వాతావరణం మారిపోయింది. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలిస్తే ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదయ్యాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలోనే నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతూ దక్షిణ భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో విస్తరించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
మధ్య అరేబియా సముద్రంలోని మిగిలిన భాగాలు, ముంబైతో సహా మహారాష్ట్రలోని మరికొన్ని భాగాలు, ఒడిశాలోని మిగిలిన భాగాలు, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బిహార్‌లలోని మరికొన్ని భాగాలకు మరింతగా విస్తరించినట్లు తెలిపింది. రానున్న మూడు రోజుల్లో ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్‌లోని కొన్ని భాగాలు, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని మరి కొన్ని భాగాలకు, ఆ తర్వాతి 3–4 రోజుల్లో జార్ఖండ్, బీహార్‌లలోని మిగిలిన భాగాలు, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని భాగాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది.
రెండ్రోజులు ఓ మోస్తరు వర్షాలు
రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు, ఒకట్రెండు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ వాఖ వివరించింది. ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతోనూ, ఇతర ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎల్‌నినో ప్రభావం, రుతుపవనాల కదలికలు మందగించడంతో జూన్ నెలలో రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది.
ఈనెల 1 నుంచి 23వ తేదీ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 97.4 మిల్లీమీటర్ల సాధారణం వర్షం కురవాల్సి ఉండగా... 81.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సాధారణం కంటే 16 శాతం లోటు ఉన్నట్లు రాష్ట్ర ప్రణాళిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. వరంగల్, హన్మకొండ, సిద్ధిపేట జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. 19 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదు కాగా... 11 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.
నెలాఖరులోగా వర్షాలు ఆశాజనకంగా ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మంగళవారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉ్రష్ణోగతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత నల్లగొండలో 38డిగ్రీ సెల్సియస్ నమోదు కాగా... కనిష్ట ఉష్ణోగ్రత దుండిగల్‌లో 21.8డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని చెబుతున్నారు. చాలాచోట్ల సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వివరించారు.
మంగళవారం రాష్ట్రంలోని ప్రధాన కేంద్రాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు(సెల్సియస్‌లలో)
కేంద్రం గరిష్ఠం కనిష్టం
అదిలాబాద్ 34.3 22.2
భద్రాచలం 32.6 24.0
దుండిగల్ 32.2 21.8
హకీంపేట్ 32.3 23.4
హన్మకొండ 36.0 23.5
హైదరాబాద్ 32.6 22.2
ఖమ్మం 35.8 23.0
మహబూబ్‌నగర్ 33.0 24.1
మెదక్ 35.8 22.8
నల్లగొండ 38.0 24.0
నిజామాబాద్ 36.2 24.9
రామగుండం 31.6 23.6


