జగిత్యాల: కని, పెంచిన తల్లి వారికి భారమైంది.. కుమారులు ఆమెను వదిలించుకోవాలనుకున్నారు. దీంతో ఏకంగా ఆర్డీవో కార్యాలయంలోనే తల్లిని వదిలి వెళ్లిపోయారు. జగిత్యాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. మల్యాల మండలానికి చెందిన కుర్రె లక్ష్మికి ఇద్దరు కుమారులు కృష్ణ, శ్రీనివాస్ ఉన్నారు. ఒకరు జగిత్యాలలో.. మరొకరు మల్యాలలో ఉంటున్నారు. లక్ష్మి భర్త నారాయణదాస్ గతంలోనే మృతిచెందాడు.
ఆస్తిపంపకాల్లో గొడవ రావడంతో సమస్య పరిష్కారానికి శనివారం ఉదయం తల్లితోపాటు కుమారులు ఆర్డీవో కార్యాలయానికి వచ్చారు. అనంతరం తల్లిని అక్కడే వదిలి వెళ్లిపోయారు. సాయంత్రమైనా కొడుకులు రాకపోవడంతో ఆ వృద్ధురాలు చలిలోనే కార్యాలయం ఆవరణలో ఉండిపోయింది. ఇది గమనించిన ఆర్డీవో వెంటనే ఆమె కొడుకులకు ఫోన్ చేసి తల్లిని వెంటనే తీసుకెళ్లాలని, సోమవారం ఇద్దరూ కలిసి తన కార్యాలయంలో హాజరుకావాలని ఆదేశించారు. వెంటనే పెద్ద కొడుకు కృష్ణ వచ్చి తల్లిని తీసుకెళ్లాడు.


