
మణికొండలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బలవన్మరణం
నాలుగు పేజీల సూసైడ్ నోట్ లభ్యం
గచ్చిబౌలి (హైదరాబాద్): ‘ఎక్కడ చూసినా కరప్షన్, పొల్యూషన్. నేను భూమి మీద ఉండి ఉద్ధరించేది ఏం లేదు. అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్నా’అంటూ ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ సీహెచ్ వెంకన్న తెలిపిన వివరాలు.. ఆంధ్రప్రదేశ్ రాజమహేంద్రవరానికి చెందిన గుత్తుల వేణుగోపాల్ (26) రాయదుర్గంలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. తన అన్నావదినలతో కలిసి మణికొండలోని షిరిడి సాయినగర్‌లో నివాసం ఉంటున్నాడు.
ఈ నెల 23న అన్న, వదినలతో కలిసి రాజమహేంద్రవరానికి వెళ్లారు. అదే రోజు రాత్రి వేణుగోపాల్ తిరిగి మణికొండకు వచ్చాడు. 24న తల్లిదండ్రులతో ఫోన్ మాట్లాడగా, 25న ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉంది. దీంతో కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం వాచ్‌మెన్‌కు ఫోన్ చేశారు. వాచ్‌మన్ వెళ్లి కిటికీలోంచి చూడగా వేణుగోపాల్ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని కనిపించాడు. దీంతో కుటుంబ సభ్యులకు వీడియో కాల్ చేసి చూపించాడు. దీనిపై రాయదుర్గం పోలీసులకు సమాచారం అందించారు. శనివారం పోస్టుమార్టం అనంతరం పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.