50% ఓటర్ల మెడపై కత్తి! | SIR draft voters lists will be announced on 17th August 2026 | Sakshi
Sakshi News home page

50% ఓటర్ల మెడపై కత్తి!

Aug 17 2026 4:22 AM | Updated on Aug 17 2026 4:22 AM

SIR draft voters lists will be announced on 17th August 2026

నేడు ‘సర్‌’ ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ 

73,39,234 మంది (21.70 శాతం) ఓటర్ల తొలగింపు 

3.38 కోట్ల నుంచి 2.64 కోట్లకు తగ్గనున్న ఓటర్ల సంఖ్య

ముసాయిదాలో 93 లక్షల మందికి నేటి నుంచి నోటీసులు  

ఈఆర్వోల విచారణలో తేలనున్న వీరి భవితవ్యం

మొత్తం ఓటర్లలో 50% మంది తొలగించిన, నోటీసులు అందుకోనున్న ఓటర్లే

3.38 కోట్ల మందిలో సురక్షిత ఓటర్లు 1.71 కోట్లే..

వివరాలు వెల్లడించనున్న సీఈఓ కార్యాలయం  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్‌)–2026 ప్రక్రియలో భాగంగా సోమవారం రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాలను ప్రకటించనున్నారు. ‘సర్‌’ప్రక్రియ ప్రారంభానికి ముందు రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లుండగా, గడువులోగా ఎన్యూమరేషన్‌ ఫారాలను సమర్పించిన 2,64,87,214 మంది ఓటర్ల పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో ఉంటాయి. ఫారం ఇవ్వలేకపోయిన 73,39,234 మంది (21.70 శాతం) ఓటర్ల పేర్లను తొలగించి ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రచురించనుంది. ఇక ముసాయిదా జాబితాలో ఉండే 2.64 కోట్ల మందిలో 93 లక్షల మందికి పైగా ఓటర్ల వివరాల్లో తేడాలు (అనామలీస్‌) కలిగి ఉండడం, మ్యాపింగ్‌ జరగకపోవడంతో వారిని ‘అనుమానాస్పద’ఓటర్లుగా ఎన్నికల సంఘం గుర్తించింది. సోమవారం నుంచి అక్టోబర్‌ 15 వరకు వీరికి స్థానిక ఎలక్ట్రోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులు (ఈఆర్వోలు) నోటీసులు జారీ చేసి విచారణకు పిలుస్తారు. తొలగించనున్న 73 లక్షల మంది ఓటర్లు, నోటీసులు అందుకోనున్న 93 లక్షల మంది ఓటర్లు కలిపితే 1.66 కోట్ల మంది కానున్నారు. అంటే, మొత్తం 3.38 కోట్ల మందిలో దాదాపుగా 49–50 శాతం మంది ఓటర్లు జాబితాలో తమ పేరు తొలగింపు ముప్పును ఎదుర్కొంటున్నారు.  

ఫారం నింపలేక ... 
నోటీసులు అందుకోనున్న 93 లక్షల మందిలో 32.36 లక్షల మంది ఓటర్లు అన్‌మ్యాప్డ్‌ ఓటర్లు ఉండగా, మిగిలిన 61.4 లక్షల మంది ఓటర్ల వివరాల్లో తేడాలున్నట్టు గుర్తించారు. ‘సర్‌– 2002’ఓటర్ల జాబితాలో తమ పేరు/తమ తల్లిదండ్రులు/వారి తల్లిదండ్రుల పేరు ఉన్నట్టు ఎన్యూమరేషన్‌ ఫారంలో పూరించాల్సి ఉండగా, ఈ వివరాలను ఇవ్వడంలో విఫలమైన/ లేక తప్పుడు వివరాలు ఇచ్చిన 32.36 లక్షల మంది ఓటర్లను అన్‌మ్యాప్డ్‌ ఓటర్లుగా గుర్తించారు. ఓటర్లకు అవగాహన కల్పించడంలో విఫలం కావడంతో చాలామంది ఓటర్లు ఎన్యుమరేషన్‌ ఫారంలోని ‘సర్‌–2002’ఓటర్ల జాబితాలోని వివరాలు రాయాల్సిన భాగంలో ప్రస్తుత ఓటర్ల జాబితాలోని వివరాలు రాశారు. దీంతో వీరు సైతం నోటీసులు అందుకోక తప్పదు. నోటీసులు వచ్చాక వీరంతా విచారణకు హాజరై ఎన్నికల సంఘం నిర్దేశించిన 11 రకాల పత్రాల్లో ఏదో ఒక పత్రాన్ని రుజువుగా చూపించాల్సి ఉంటుంది. జూలై 15కి ముందు జారీ చేసిన ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ను సైతం తాజాగా ఈ జాబితాలో ఈసీ చేర్చింది. విచారణలో ఈఆర్వోలు సంతృప్తి చెందితేనే అక్టోబర్‌ 19న ప్రకటించే తుది ‘సర్‌’ఓటర్ల జాబితాలో వీరి పేర్లను ప్రచురిస్తారు.  

తొలగిస్తే కారణం చెప్తారు.. 
73,39,234 మంది ఓటర్లను తొలగించి వారి పేరుతో ‘ఏఎస్‌డీడీ’(అబ్సెంటీ, షిఫ్ట్‌టెడ్, డెడ్, డూబ్లికేట్‌) ఓటర్ల జాబితాను ప్రత్యేకంగా ఎన్నికల సంఘం ప్రచురించనుంది. అందులోని ఏ ఓటరును ఏ కారణంతో తొలగించారో ఓటరు పేరు చివరన ఉన్న కాలమ్‌లో ప్రచురిస్తారు. అచూకీ లేనివారు/శాశ్వతంగా నివాసం మారినవారు/చనిపోయినవారు/ఇప్పటికే నమోదైనవారు అనే నాలుగు రకాల కారణాలు అందులో ఉంటాయి.  

ఓటరుగా నమోదుకు మరో అవకాశం.. 
ఓటర్ల జాబితాలో ఇప్పటి వరకు పేరు లేకపోవడం లేదా ఎన్యుమరేషన్‌ ఫారం దాఖలు చేయకపోవడంతో ముసాయిదా జాబితాలో స్థానం పొందని ఓటర్లకు ఎన్నికల సంఘం కొత్తగా ఓటరుగా నమోదు కావడానికి అవకాశం కల్పించింది. ముసాయిదాపై అభ్యంతరాలతోపాటు కొత్త ఓటర్ల నమోదుకు సెప్టెంబర్‌ 16వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. వీరికి సైతం ఈఆర్వోలు నోటీసులు జారీ చేసి అక్టోబర్‌ 15లోగా విచారిస్తారు. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను అక్టోబర్‌ 19న ప్రకటించే తుది ‘సర్‌’ఓటర్ల జాబితాలో చోటు కల్పిస్తారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement