
పోకిరీల కట్టడికి ప్రత్యేక చట్టం లేని షీ–టీమ్స్
2015లోనే తమిళనాడు తరహా
చట్ట ప్రతిపాదన చేసిన పోలీసు విభాగం
ఇప్పటికీ ప్రభుత్వం వద్ద ఫైలు పెండింగ్‌లో ఉన్న వైనం
భాగ్యనగర వీధుల్లో ఇటీవల జరిగిన వివిధ ఊరేగింపులు, వేడుకల్లో మహిళలు, యువతులను అసభ్యంగా తాకుతూ, అనుచితంగా ప్రవర్తిస్తూ 644 మంది ఆకతాయిలు షీ–టీమ్స్‌కు చిక్కారు. కానీ వారిలో కేవలం ఐదుగురిపైనే పోలీసులు కేసులు నమోదు చేయగలిగారు. మిగిలిన వారిని మందలింపులు, కౌన్సెలింగ్‌లతోనే సరిపెట్టి పంపించేశారు. అందుకు కారణం.. పోకిరీలకు చెక్ చెప్పడానికి అవసరమైన ప్రత్యేక చట్టం లేకపోవడమే.
సాక్షి, హైదరాబాద్: చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడే వారికి జీవితఖైదు లాంటి తీవ్ర శిక్షలు విధించేందుకు వీలు కల్పించే అత్యంత కఠినమైన పోక్సో చట్టం అమల్లో ఉండగా.. మహిళలు, యువతులను వేధించే ఆకతాయిలు, పోకిరీలపై కఠిన చర్యలు తీసుకోవడానికి మాత్రం ప్రస్తుత చట్టాల్లోని సెక్షన్లు ఉపయుక్తంగా లేవు. ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా షీ–టీమ్స్ తయారు చేసిన ప్రతిపాదనే తెలంగాణ ప్రొహిబిషన్ ఆఫ్ ఈవ్ టీజింగ్ యాక్ట్. పోకిరీల పీచమణిచేందుకు ప్రత్యేక చట్టం కావాలని షీ–టీమ్స్ పదేళ్ల క్రితమే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా ఇప్పటికీ స్పందన రాలేదు. ఈ ఫైల్ న్యాయ విభాగం వద్దే పెండింగ్‌లో ఉండిపోయింది.
తమిళనాడులో 1998 నుంచే...
పోకిరీలు మొదలు ఆన్‌లైన్‌లో, సోషల్ మీడియా ద్వారా అదును చూసి కాటువేస్తున్న నయవంచకుల వరకు.. ఎందరో మృగాళ్ల బారి నుంచి అతివల్ని రక్షిస్తున్న హైదరాబాద్ షీ–టీమ్స్ ఏర్పడి 11 ఏళ్లు కావస్తోంది. ఇప్ప టికే గణనీ యమైన ఫలి తాలు సాధిస్తున్న ఈ బృందాల పనితీరును మరింత మెరుగుపరచడంతోపాటు మహిళలు/యువతులకు పూర్తిస్థాయి భరోసా ఇవ్వడానికి ప్రత్యేక చట్టం అవసరం ఉందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. దీనికోసం తమిళనాడులో 1998 నుంచి అమల్లో ఉన్న ‘తమిళనాడు ప్రొహిబిషన్ ఆఫ్ ఈవ్ టీజింగ్ యాక్ట్’ తరహాలో రూపొందించిన ముసాయిదాను 2015లోనే రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు.
చిక్కుతున్నా చిన్న కేసులే...
బహిరంగ ప్రదేశాల్లో యువతులు/మహిళల్ని వేధిస్తున్న పోకిరీలను నిత్యం షీ–టీమ్స్ పట్టుకుంటున్నా తీవ్రత, ఆధారాలు ఉంటే తప్ప నిందితులపై బీఎన్‌ఎస్‌తోపాటు నిర్భయ, యాంటీ ర్యాగింగ్ యాక్ట్‌ల ప్రకారం కేసులు నమోదు చేయడం సాధ్యం కావట్లేదు. ఫలితంగా రాష్ట్రంలో ఏటా షీ–టీమ్స్‌కు చిక్కుతున్న పోకిరీల్లో 90 శాతం మంది పెట్టీ కేసులు, నామమాత్రపు జరిమానాతో బయటప డిపోతున్నారు.
ఈవ్ టీజింగ్‌కు పాల్పడుతూ రెండోసారి చిక్కిన వ్యక్తులతోపాటు తీవ్ర స్థాయిలో రెచ్చిపోయిన వారిపైనే కేసులు నమోదు చేయగలుగుతున్నారు. అయితే ప్రతి సందర్భంలోనూ రిపీటెడ్ అఫెండర్స్‌ను గుర్తించడం సాధ్యం కావట్లేదు. పోకిరీల వేధింపులు చిన్న విషయంగా కనిపించినా బాధితులపై వాటి ప్రభావం తీవ్రంగా ఉండటంతోపాటు సమాజం, పోలీసులపై ఏహ్యభావం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో న్యాయశాఖ వద్ద పెండింగ్‌లో ఉన్న ముసాయిదా చట్టం కార్యరూపం దాలిస్తే తెలంగాణలోనూ సత్ఫలితాలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.
ప్రత్యేక చట్ట ముసాయిదాలోని ముఖ్యాంశాలు
⇒ బహిరంగ ప్రదేశాలతోపాటు పనిచేసే ప్రాంతాలు, మాల్స్... ఇలా ఎక్కడైనా ఈవ్ టీజింగ్‌కు పాల్పడుతూ చిక్కిన పోకిరీలపై నేరం రుజువైతే ఏడాది జైలు లేదా రూ. 10 వేల జరిమానా లేదా రెండూ పడతాయి.
⇒ ఈవ్ టీజింగ్ చేయడానికి పోకిరీలు వాహనాలను వినియోగిస్తే వాటిని పోలీసులు స్వాధీనం చేసుకొనే అవకాశం ఏర్పడుతుంది.
⇒ దేవాలయాలతోపాటు మాల్స్, సినిమా హాల్స్, విద్యాసంస్థలు తదితర చోట్ల జరిగే ఈవ్ టీజింగ్‌లను నిరోధించాల్సిన బాధ్యత వాటి నిర్వాహకులపై ఉంటుంది. అలాంటి సమాచారాన్ని తక్షణం సంబంధిత పోలీసులకు చేరవేయాల్సిందే. దీనికి భిన్నంగా వ్యవహరిస్తే ఆ నేరానికి యాజమాన్యాలనూ బాధ్యుల్ని చేయవచ్చు. వారికి కూడా న్యాయస్థానం జరిమానా విధించే అవకాశం ఉంటుంది.
రాష్ట్ర షీ–టీమ్స్ 2024 గణాంకాల ప్రకారం పోకిరీలపై కేసుల సంఖ్య
⇒ చిక్కిన పోకిరీలు 26,526
⇒ కౌన్సెలింగ్‌తో బయటపడిన వాళ్లు 15,664
⇒ వారిలో ఫిర్యాదులతో చిక్కింది 10,862
⇒ పెట్టీ కేసులుగా నమోదైనవి: 3,329
⇒ ఐపీసీ/బీఎన్‌ఎస్‌ల కింద నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు 830