
అనిల్ ప్రయాణించిన వాహనం
రంగంలోకి దిగిన ఎమ్మెల్యే సోదరుడి కుమారుడు!
తెలంగాణలో ‘పెద్ద’ స్థాయి ఒత్తిడితో కేసును తొక్కిపెట్టేందుకు యత్నం
నత్తనడకన కేసు దర్యాప్తు సెటిల్‌మెంట్ వ్యవహారాలే హత్యకు కారణం
సాక్షి టాస్క్‌ఫోర్స్/సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/ మెదక్ జోన్/కొల్చారం: మెదక్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి మారెల్లి అనిల్ కుమార్ హత్య కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ హత్య వెనుక వైఎస్సార్ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే మనవడి ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం హైదరా బాద్‌లో పార్టీ సమావేశానికి హాజరై తిరిగి వెళ్తుండగా మెదక్ జిల్లా ఘన్‌పూర్ శివారులో రెండు కార్లలో వచ్చిన దుండగులు అనిల్‌పై కాల్పులు జరిపి హత్య చేసిన సంగతి తెలిసిందే. కాగా ఆ టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే మన వడు హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు.
ఆపై సెటిల్‌మెంట్లు.. దందాలు మొదలుపెట్టారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పేరుతో ఏపీలోని ప్రొద్దుటూరు, బద్వేలు, నాగులపల్లె, దర్శి ప్రాంతాల్లోని సన్నిహితుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు. వారికి నమ్మకం కలిగించేందుకు కొన్ని ప్లాట్లను ఆయా వ్యక్తుల పేర్ల మీద ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ విషయం బయటపడటంతో దర్శి ప్రాంతానికి చెందిన వ్యక్తులు.. ఎమ్మెల్యే మనవడిని నిలదీ శారు. తమకు డబ్బులు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యవహారాల నేపథ్యంలో ఓ సెటిల్‌మెంట్‌కు సంబంధించి అనిల్‌కు ఆ ఎమ్మెల్యే మనవడు దాదాపు రూ.కోటి ఇవ్వాల్సి ఉన్నట్లు తెలిసింది.
డబ్బులు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో బెంజ్ కారు అప్పగించినట్లు సమాచారం. రోజులు గడుస్తున్నా ఆ డబ్బులు చెల్లించకపోవడంతో ఎమ్మెల్యే మనవడిని అనిల్ పరుష పదజాలంతో దూషించినట్లు తెలిసింది. దీన్ని ఎమ్మెల్యే మనవడు తీవ్ర అవమానంగా భావించి.. ఓ మాజీ నక్సలైట్‌కు సుపారీ, ఆయుధం ఇచ్చి అనిల్‌ను హత్య చేయించినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు
అనిల్ హత్యలో ఏపీకి చెందిన కొందరు ప్రత్యక్షంగా పాల్గొన్నారని, నేరం చేసిన తర్వాత అక్కడికే పారిపోయారని తెలిసింది. ఇందులో తన మనవడి పాత్ర వెలుగులోకి వస్తుండటంతో ఆ సీనియర్ ఎమ్మెల్యే చక్రం తిప్పారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఆయన సోదరుడి కుమారుడు రంగంలోకి దిగినట్లు విశ్వసనీయంగా తెలిసింది. తెలంగాణలో రాజకీయ పెద్దలతో తనకున్న సన్నిహిత సంబంధాలను ఉపయోగించుకుని.. ఇక్కడి పోలీసులపై ‘పెద్ద’ స్థాయిలో ఒత్తిళ్లు తెస్తున్నట్టు సమాచారం.
కేసును తొక్కిపెట్టేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే రెండు రోజులుగా దర్యాప్తు నత్తనడకన నడుస్తున్నట్లు సమాచారం. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పేర్కొంటున్న పోలీసులు.. ఎలాంటి పురోగతిని సాధించలేకపోతున్నారు. దీనికి రాజకీయ ఒత్తిళ్లే కారణమని తెలుస్తోంది. కాగా, అనిల్ అంత్యక్రియలు బుధవారం ఆయన స్వగ్రామం పైతరలో జరిగాయి.
అదుపులో నిందితులు?
సీనియర్ ఎమ్మెల్యే మనుమడి వద్ద విల్లా కొనుగోలు చేసిన రామచంద్రారెడ్డి అనే వ్యక్తిని మెదక్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అతడిని జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో విచారిస్తున్నట్లు సమాచారం. అనిల్‌తో పరిచయాలపై ఆరా తీసినట్లు తెలిసింది. అనిల్ గతంలో పలు తగాదాల్లో ఉన్న భూములను సెటిల్‌మెంట్లు చేశాడని, అందుకే విల్లాకు సంబంధించిన గొడవ తనకు చెప్పటంతో రూ.2 కోట్లకుగాను రూ.1.20 కోట్లు వసూలు చేశాడని పోలీసులకు వివరించినట్లు తెలిసింది. కాగా అనిల్‌పై కాల్పులు జరిపిన నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. ఈ విషయంపై మెదక్ డీఎస్పీని వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. లేరంటూ సమాధానం దాటవేశారు.