మాకూ 'మంత్రి' ఇవ్వండి | Senior leader Jana Reddy letter leads to discussion in the party | Sakshi
Sakshi News home page

మాకూ 'మంత్రి' ఇవ్వండి

Apr 2 2025 4:24 AM | Updated on Apr 2 2025 4:24 AM

Senior leader Jana Reddy letter leads to discussion in the party

కేబినెట్‌లో చోటు కోసం అధిష్టానానికి లేఖల రాయబారం

ఇప్పటికే మాదిగ, లంబాడా, రంగారెడ్డి జిల్లా నేతల లేఖలు

తాజాగా వెలుగులోకి సీనియర్‌ నేత జానారెడ్డి లేఖ

రంగారెడ్డి, హైదరాబాద్‌ ఎమ్మెల్యేల కోసం వినతి

ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్‌.. నేడు వెళ్లనున్న డిప్యూటీ సీఎం

రాహుల్‌గాంధీతో భేటీకానున్న సీఎం 

విస్తరణ ఉంటే ఈ వారంలో... లేదంటే వాయిదానే

సాక్షి, హైదరాబాద్‌: ఎడతెగని సస్పెన్స్‌గా మారిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ అంశం ఆశావహులను ఒక్కచోట నిలువనీయటం లేదు. అమాత్య పదవి కోసం ఎవరి ప్రయ­త్నాలు వారు చేసుకొంటున్నారు. కొందరు నేతలు పార్టీ అధిష్టానానికి లేఖల ద్వారా విన్నపాలు చేసుకుంటున్నారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సమయంలోనే ఢిల్లీ పెద్దలకు సామాజిక వర్గాలవారీగా ఎమ్మె­ల్యేలు లేఖలు రాశారు. 

తాజాగా పార్టీ సీనియర్‌ నేత కె.జానారెడ్డి రాసిన లేఖ కూడా వెలుగులోకి వచ్చింది. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలని ఆయ­న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాసిన లేఖ పార్టీలో చర్చకు దారితీసింది. 

ఉమ్మడి జిల్లాలు.. సామాజిక వర్గాలు
రాష్ట్ర మంత్రివర్గంలో ప్రస్తుతానికి ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. రెడ్డి సామాజిక వర్గానికి నాలుగు, బీసీలకు రెండు, మాల, మాదిగ, ఆదివాసీ వర్గాలకు ఒక్కోటి చొప్పున కేబినెట్‌ బెర్తులు లభించాయి. విస్తరణ జరిగితే బీసీ, రెడ్డి వర్గాలకు ఒకటి లేదా రెండు బెర్తులు ఇవ్వాలనే డిమాండ్‌ ఉంది. జనాభా ప్రాతిపదికన మాదిగ, లంబాడా వర్గాలకు చెరో బెర్తు ఇవ్వాలనే డిమాండ్‌ కూడా తెరపైకి వచ్చింది. బెర్తు దక్కని నాలుగు ఉమ్మడి జిల్లాల నేతల నుంచి కూడా కేబినెట్‌లో స్థానంపై చాలా ఆశలున్నాయి. 

ఒకరిద్దరు ఎమ్మెల్యేలకు అసెంబ్లీ ఎన్నికలకు ముందే అధిష్టానం మాట ఇచ్చిందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏ ప్రాతి­పదికన కేబినెట్‌లో ఖాళీ బెర్తులు భర్తీ చేయా­లి? ఎన్ని భర్తీ చేయాలన్న దానిపై అధి­ష్టానం మల్లగుల్లాలు పడుతోంది. విస్త­రణ వార్తల నేపథ్యంలో మాదిగ, లంబాడా వర్గా­లతో పాటు రంగారెడ్డి జిల్లా నేతలు ఇప్పటికే అధిష్టానానికి లేఖలు రాశారు. ఒకరిద్దరికి మంత్రి పదవుల కేటాయింపులో కుటుంబ కథా చిత్రాలు కూడా నడుస్తున్నాయి. 

ఉంటుందా... వాయిదానా?
ఇలాంటి పరిస్థితుల్లో అసలు కేబినెట్‌ విస్తరణ ఉంటుందా లేదా? అన్న అనుమా­నాలు రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల్లో వ్యక్తమవు­తున్నాయి. అయితే, ఈ నెల 3 లేదా 4వ తేదీన విస్తరణ ఉంటుందని, మళ్లీ వాయిదా పడినా మరో వారం రోజుల్లో కచ్చితంగా విస్తరణ జరుగుతుందని ఢిల్లీ నుంచి సంకేతాలు అందుతున్నాయి. మరోవైపు కేబి­నెట్‌ విస్తరణ జరిగితే ఈ వారంలోనే ఉంటుందని, లేదంటే నిరవధికంగా వాయిదా పడినట్టేననే చర్చ కూడా కాంగ్రెస్‌ వర్గాల్లో జరుగుతుండడం గమనార్హం.

ఢిల్లీకి వెళ్లిన సీఎం, నేడు వెళ్లనున్న డిప్యూటీ
ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి మంగళవారం ఢిల్లీ వెళ్లారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బుధవారం వెళ్లనున్నారు. బీసీలకు విద్య, ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని పార్లమెంటులో కూడా ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేస్తూ బీసీ సంఘాలు జంతర్‌మంతర్‌ వద్ద నిర్వహిస్తున్న ధర్నాలో వారు పాల్గొంటారు. ఈ ధర్నాలో పాల్గొనేందుకు పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, బీసీ ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్య, వాకిటి శ్రీహరి, మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్, ప్రకాశ్‌గౌడ్, ఈర్లపల్లి శంకరయ్య తదితరులు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. 

ఈ ధర్నాకు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ కూడా హాజరయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఢిల్లీలో రాహుల్‌ను సీఎం కలుస్తారని సమాచారం. రాష్ట్ర కాంగ్రెస్‌ ముఖ్య నేతలంతా ఢిల్లీలోనే ఉన్నందున వారితో పార్టీ అధిష్టానం మరోమారు చర్చలు జరిపి, మంత్రివర్గ విస్తరణ ముహూర్తాన్ని ఫైనల్‌ చేస్తుందా? అనేది నేడో రేపో తేలనుంది.  

Advertisement
 
Advertisement
Advertisement