
పద్మవ్యూహాన్ని తలపిస్తున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్లు
రైల్వేస్టేషన్ చుట్టుపక్కల ఐదు చోట్ల సిటీబస్ పాయింట్స్
ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లే ప్రయాణికులకు చుక్కలే...
ప్రతిపాదనలకే పరిమితమైన ఇంటిగ్రేటెడ్ సిటీ సెంట్రల్ బస్‌స్టేషన్
అది సికింద్రాబాద్ రైల్వేస్టేషన్. అక్కడికి రోజూ వందల కొద్దీ ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి.. ట్రిప్పులు వేలల్లో ఉంటాయి.. అయితే సిటీ నలుమూల నుంచి వచ్చే బస్సులను స్టేషన్‌కు నలు దిక్కుల కనీసం రెండు కిలోమీటర్ దూరంలో నిలిపి ఉంచుతున్నారు. ఒక బస్టాపు నుంచి మరో బస్టాపు వరకు చేరుకోవాలంటే రోడ్లపై కిక్కిరిసే వాహనాలను దాటుకుంటూ ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ వెళ్లాల్సి వస్తోంది.
అటు గురుద్వారా నుంచి ఇటు చిలకలగూడ చౌరస్తా వరకు, అల్ఫా హోటల్ నుంచి బ్లూసీ హాటల్ వరకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిసరాలు నిత్యం పద్మవ్యూహాన్ని తలపిస్తాయి. రైల్వేస్టేషన్‌కు, మెట్రోస్టేషన్ వెళ్లాలన్నా తిప్పలే. రైల్వే, మెట్రో, సిటీబస్సుల మధ్య సమన్వయంతోపాటు ప్రయాణికులు ఒక రవాణా సదుపాయం నుంచి మరో రవాణా సదుపాయానికి సులభంగా మారేందుకు సికింద్రాబాద్‌లో ఇంటిగ్రేటెడ్ సెంట్రల్ బస్టేషన్ కోసం పదేళ్ల క్రితమే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రణాళికలను కూడా రూపొందించారు. కానీ, ఇప్పటివరకు అది ఆచరణకు నోచలేదు.
ఏ బస్సు ఎక్కడో...
నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతిరోజు సుమారు 1,500 బస్సులు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ బస్సులు రోజుకు 5 వేల ట్రిప్పులు తిరుగుతాయి. సుమారు 5.5 లక్షల మంది సికింద్రాబాద్ కేంద్రంగా ప్రయాణిస్తుంటారు. హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, ఘట్కేసర్, ఉప్పల్ తదితర ప్రాంతాల నుంచి సికింద్రాబాద్‌కు రాకపోకలు సాగించే సిటీ బస్సులన్నీ చిలకలగూడ చౌరస్తాకే పరిమితమవుతాయి. కానీ, ప్రయాణికులు అక్కడి నుంచి అఫ్జల్‌గంజ్, కోఠి, అమీర్‌పేట్, హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాలకు వెళ్లాలంటే ఒలిఫెంటా బ్రిడ్జి వద్ద రోడ్డు దాటి రైల్వేస్టేషన్ వరకు నడవాలి.
మల్కాజిగిరి, నేరేడ్‌మెట్, సఫిల్‌గూడ, తుకారాంగేట్, లాలాగూడ తదితర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులన్నీ బ్లూసీ హోటల్ దగ్గర ఆగుతాయి. ప్రయాణికులు అక్కడి నుంచి రైల్వేస్టేషన్‌కు వెళ్లాలంటే రోడ్డు దాటి ఫర్లాంగ్ దూరానికి పైగా నడవాల్సిందే.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఉప్పల్, తార్నాక, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం వైపు వెళ్లే ప్రయాణికులు కిలోమీటర్‌కుపైగా నడిచి చిలకలగూడ చౌరస్తాకు చేరుకోవాలి.
జగద్గిరిగుట్ట, జీడిమెట్ల, అపురూప కాలనీ, బాలానగర్, పటాన్‌చెరు, బీహెచ్‌ఈఎల్, కూకట్‌పల్లి హౌసింగ్‌రోడ్డు, అల్వాల్, తిరుమలగిరి తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే సిటీ బస్సులు గురుద్వారా వద్ద ఆగుతాయి. అక్కడి నుంచి మరో బస్సు కోసం బ్లూసీ హోటల్ వరకు లేదా చిలకలగూడ చౌరస్తా వరకు నడవాలంటే కిక్కిరిసిన రోడ్డుపైన నడక నరకప్రాయమే.
రైల్వేస్టేషన్ విస్తరణ ముప్పు...
అఫ్జల్‌గంజ్, కోఠి, జూపార్క్, ఈఎస్‌ఐ, హైటెక్‌సిటీ, జూబ్లీహిల్స్, కొండాపూర్ తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే సిటీ బస్సులు రైల్వేస్టేషన్ ఎదురుగా ఆగుతాయి. ప్రస్తుతం స్టేషన్ విస్తరణలో భాగంగా ట్యాక్సీ స్టాండ్‌ను అక్కడి నుంచి తొలగించారు. ఇప్పుడు బస్సులు ఆపే ప్రాంతం కూడా రైల్వే ప్రాంగణంలోనే ఉంది. దీంతో ఈ బస్టాప్ భవితవ్యం ప్రశ్నార్థంకంగా మారింది. సుమారు నాలుగు దశాబ్దాల క్రితం 1980లలో సికింద్రాబాద్‌లో రేతిఫైల్ బస్‌స్టేషన్‌ను కట్టించారు. ఇప్పుడు పట్టుమని పది బస్సులు ఆగేందుకు కూడా అక్కడ స్థలం అందుబాటులో లేదు. రేతిఫైల్ బస్‌స్టేషన్ ఉన్నా లేనట్లే.
చదవండి: ఆధార్ అప్‌డేట్ ఉంటేనే.. ఫ్రీ జర్నీ!
ఇంటిగ్రేటెడ్ బస్‌స్టేషన్ ఏమైనట్లు..
కనీసం రెండు వేల సిటీ బస్సులను ఒకేచోట నిలిపేందుకు వీలుగా పాతగాంధీ ఆసుపత్రి స్థలంలో అతి పెద్ద బస్‌స్టేషన్‌ను నిర్మించాలని అప్పట్లో ప్రతిపాదించారు. దీనివల్ల రైల్వే, మెట్రో, ఆర్టీసీల మధ్య సీమ్‌లెస్ జర్నీ సదుపాయం అందుబాటులోకి వస్తుందని భావించారు. కానీ, ఈ స్థలాన్ని మెట్రోకు కేటాయించడంతో ఇంటిగ్రేటెడ్ బస్‌స్టేషన్ ప్రతిపాదన అటకెక్కింది. హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ సైతం ఈ స్థలాన్ని ఇప్పటి వరకు వినియోగంలోకి తీసుకురాకపోవడం గమనార్హం. బెంగళూర్ మెజాస్టిక్ బస్‌స్టేషన్ తరహాలో సికింద్రాబాద్‌లో ఒక సమగ్రమైన బస్‌స్టేషన్ ఏర్పాటు చేస్తే ప్రయాణికులు సులభంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా రాకపోకలు సాగించేందుకు అవకాశం ఉంటుంది.