
‘‘అమ్మా.. ఆధార్ కార్డ్ అప్‌డేట్ ఉండాలె. లేకుంటే పైసలిచ్చి టికెట్ తీసుకోండి..’’ తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్న మాట. ‘‘ఇయ్యాళ్టికి వదిలేస్తున్నాం.. రేపటికల్లా అప్‌డేట్ చేసుకోండ్రి.. లేకుంటే మాత్రం ఊకోం.’’ ఇది మరికొందరు కండకర్లు చెబుతున్న మాట.
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆధార్ అప్‌డేట్ ఉంటేనే ఆ ప్రయాణం వర్తిస్తుందని పలువురు కండక్టర్లు తెగేసి చెబుతున్నారు. ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అని ఉండడమే అందుకు ప్రధాన అభ్యంతరంగా చెబుతున్నారు.
మన దేశంలో ఆధార్ కార్డులు జారీ అయ్యాక ఇప్పటిదాకా ఎలాంటి అప్‌డేట్ చేసుకోని వాళ్లు కోట్లలోనే ఉన్నారు. అదే టైంలో.. కేవలం పేర్లు, డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే మార్చేసుకున్నవాళ్లు ఉన్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఉమ్మడి జిల్లాల పేరుమీదే.. ఏపీ రాష్ట్రం అలాగే ఉండిపోతూ వచ్చింది.
అయితే తెలంగాణలో ఫ్రీ జర్నీ అమలై ఏడాదిన్నర పైనే అవుతోంది. ఈ క్రమంలో ఆధార్ అప్‌డేట్ చేసుకోకపోవడంపై కొందరు కండక్టర్లు మహిళా ప్రయాణికులపై అసహనం వ్యక్తం చేస్తుండడం గమనార్హం. అయితే ఆధార్ అప్‌డేట్ వ్యవహారం అనుకున్నంత ఈజీగా సాగడం లేదు. ఈ తరుణంలో ఫ్రీ టికెట్ జర్నీకి ఇబ్బందులు తప్పవా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో..
ఆధార్ అప్‌డేట్ ఉంటేనే టికెట్ అనే దానికి అధికారిక ఉత్తర్వులు ఏమైనా జారీ అయ్యాయా?.. పోనీ ఉద్యోగులకు ఏమైనా ఆదేశాలిచ్చారా? అనేదానిపై తెలంగాణ ఆర్టీసీ స్పందించాల్సి ఉంది.
సిగ్నల్ లేదు.. పైసలియ్యండి!
తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో క్యాష్‌లెస్ పేమెంట్‌లో భాగంగా.. ఆన్‌లైన్ పేమెంట్లను క్యూఆర్ కోడ్‌తో ప్రొత్సహిస్తోంది తెలంగాణ ఆర్టీసీ. అయితే కొందరు కండక్టర్లు ఈ విషయంలో తీవ్ర అసహనం ప్రదర్శిస్తున్నారు. ప్రయాణికులు అధికంగా ఉండడమో లేదంటే ఇతర కారణాలో తెలియదుగానీ.. సిగ్నల్ లేదని, టికెట్ మిషన్ పని చేయడం లేదని.. ఏదో ఒక కారణం చెబుతూ టికెట్‌కు క్యాష్ చెల్లించాలని కోరుతున్నారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్ సిటీ బస్సుల్లో ప్రయాణికులు ఈ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.