
జైలుకు వెళ్లి బెయిలుపై వచ్చిన వారి ట్రాకింగ్
రైల్వే పోలీసుల ప్రత్యేక ప్రణాళిక
వందలాది రైళ్లు.. లక్షలాది మంది ప్రయాణికులు.. ఈ క్రమంలో నేరాల సంఖ్యా అదేవిధంగా పెరిగిపోతోంది. ఈ వ్యవహారం రైల్వే పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారిపోయింది. కళ్లు మూసి తెరిచేలోగా మాయమవుతున్న బ్యాగులు.. చైన్ స్నాచింగ్ గ్యాంగ్‌లు.. సెల్‌ఫోన్లు ఎత్తుకెళ్లే ముఠాలు.. అవసరమైతే దాడులకు వెరవని కరుడుగట్టిన నేరగాళ్లు.. ఈ నేపథ్యంలో నేర నియంత్రణ ఎలా..? నేరగాళ్లను కట్టడి చేయడం ఎలా..? అనేది ప్రభుత్వ రైల్వే పోలీసులకు (జీఆర్‌పీ) పెద్ద టాస్క్‌గా మారింది. ఇందుకు సీనియర్ అధికారుల సూచనల ఆధారంగా వ్యూహం రచించారు. అసలు నేరాలకు కారణం ఎవరు అనే దానిపై దృష్టి సారించారు. టెక్నాలజీ సాయంతో బృందాలు రంగంలోకి దిగాయి. పని మొదలెట్టాయి. ఆ వ్యూహం పేరే.. ‘జైలు–బెయిలు’.
సికింద్రాబాద్: రైళ్లలో పాత నేరస్తులే ఎక్కువగా నేరాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. అరెస్టయ్యి బెయిలుపై విడుదలైన వారిపైనే దృష్టి పెట్టాలని నిర్ణయించారు. ప్రత్యేక బృందాలు రిమాండ్ ఖైదీలు, బెయిల్ పొంది జనంలో తిరుగుతున్న వారి వివరాలను సేకరించే పనిలో పడింది. ఆ వివరాలతో పాటు వారి కదలికలపై నజర్‌కు టెక్నాలజీ (Technology) సాయం తీసుకుంటోంది.
కళ్లుమూసి తెరిచేలోగా మాయం..
ఇటీవలి కాలంలో సికింద్రాబాద్ జిల్లా పరిధిలో రైళ్లలో నేరాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కారణాలేమైనప్పటికీ అన్ని నేరాలు పోలీస్ స్టేషన్ వరకు రావడం లేదు కూడా.. కదులుతున్న రైళ్లలో సెల్‌ఫోన్లను లాక్కెళ్లడం.. లగేజీలు దొంగిలించడం.. ఏసీ బోగీల్లో విలువైన వస్తువుల తస్కరణ.. కోచ్‌లలో దొంగల స్వైర విహారం వంటివి నమోదవుతున్నాయి. ముఖ్యంగా సికింద్రాబాద్, కాచిగూడ, హైదరాబాద్, చర్లపల్లి రైల్వే స్టేషన్లలో అధిక శాతం కేసులు నమోదవుతున్నాయి. నేరాలు జరిగే సమయం చూస్తే అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు అధికశాతం జరుగుతున్నట్లు రికార్డులు చెబుతున్నాయి.
బాబోయ్ ఇంతమంది నేరస్తులా..!
సికింద్రాబాద్ జిల్లా పరిధిలో ఐదేళ్ల నేరాలు పరిశీలిస్తే 149 మంది చైన్‌స్నాచర్లు.. 694 మంది నేరగాళ్లు దొంగతనం.. దోపిడీ కేసుల్లో అరెస్టయ్యారు. వీరిలో కొందరు జైళ్లలో ఉండగా మరికొందరు బెయిల్‌పై బయటకొచ్చారు. అసలు చిక్కు ఇక్కడే మొదలైంది. వీరి నేరాల పథక రచనకు జైళ్లు వేదికలుగా మారుతున్నాయని పోలీసులు భావిస్తున్నారు. అందుకే జైలులో ఎందరున్నారు. బెయిల్ (Bail) మీద బయటకొచ్చిందెవరు అనే విషయంపై జీఆర్పీ పూర్తి స్థాయిలో దృష్టి సారించింది.
ట్రాకింగ్ చాలా కష్టమే.. అయినా..
ఓ రకంగా చూస్తే సికింద్రాబాద్ జిల్లా పరిధిలోని నేరస్తులందరినీ ట్రాక్ చేయడం చాలా కష్టమైన పనే. చాలా మంది సిబ్బంది కూడా అవసరం. అదనపు పనిగంటలు కూడా కావాలి. ఓ వైపు రోజు వారీ విధి నిర్వహణ.. రైళ్లలో భద్రత.. రైలు ప్రమాదాల మృతుల గుర్తింపు.. ఇతర విధులకే సరిపడా సిబ్బంది లేరు. సికింద్రాబాద్ జిల్లాలో తీసుకుంటే 12 రైల్వే పోలీస్ స్టేషన్లు.. 17 అవుట్‌పోస్టులు ఉన్నాయి. వీటిలో నేరాలు ఎక్కువ సంఖ్యలో జరుగుతున్న సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి రైల్వేస్టేషన్ల పరిధిలో జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్ (RPF) పోలీసులు 667 మంది అవసరం ఉండగా ప్రస్తుతం 364 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. రైలు ప్రమాద ఘటనల్లో మృతుల దర్యాప్తు కోసయే సమయం వృథా అవుతున్నట్టు పోలీసులు చెబుతున్నారు.
చదవండి: డ్రైవర్ ఆవలిస్తే అలర్ట్ చేస్తుంది..!
టెక్నాలజీ సాయంతో...
సమస్యలన్నింటినీ పక్కన పెట్టి.. నేర నియంత్రణ కోసం సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ చందనాదీప్తి (Chandana Deepti) నేతృత్వంలో సీనియర్ అధికారుల సూచనలతో పోలీసులు పక్కా వ్యూహంతో ముందుకు కదిలేందుకు నిర్ణయించుకున్నారు. టెక్నాలజీ సాయంతోనేరగాళ్ల మొబైల్ నెంబర్లు, ఆధార్, చిరునామాలు ఇలాంటి ప్రాథమిక అంశాల ఆధారంగా వారి కదలికలపై దృష్టి సారించేలా ప్రయత్నిస్తున్నారు. వారు ఏ ప్రాంతాల్లో సంచరిస్తున్నారు. వారు తిరుగుతున్న వ్యక్తులు ఎవరు? రాష్ట్రం దాటి వెళ్తున్నారా.. రైలు ప్రయాణాల్లో ఉంటున్నారా..? స్రత్పవర్తన ఉందా ఇలాంటి అంశాల ఆధారంగా వారిని ట్రాక్ చేస్తున్నారు.