
ఆర్టీసీ బస్సుల్లో ఏఐ ఆధారిత ఆధునిక సాంకేతికత
రోడ్డుపై ప్రమాదం పొంచి ఉన్నా, డ్రైవర్ నిద్ర మత్తులో ఉన్నా, సెల్‌ఫోన్ మాట్లాడుతున్నా హెచ్చరించే వ్యవస్థ
త్వరలో డ్రైవర్ మానిటరింగ్ సిస్టం, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అలర్ట్ సిస్టంల ఏర్పాటు
రియల్ టైమ్ దృశ్యాలను నేరుగా బస్‌భవన్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో వీక్షించే వీలు
ప్రయోగాత్మకంగా 200 బస్సుల్లో కెమెరాల ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదాలను నివారించే ఉద్దేశంతో తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో దేశంలో మరే రోడ్డు రవాణా సంస్థల్లో లేని సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేçయనున్నారు. ఎదురుగా రోడ్డుపై ప్రమాదం పొంచి ఉన్నా, డ్రైవర్ అప్రమత్తంగా లేక ప్రమాదానికి కారణం అయ్యేలా ఉన్నా, చివరకు డ్రైవర్ ఆవలించినా ఈ వ్యవస్థ అప్రమత్తం చేస్తుంది. తద్వారా డ్రైవర్ ప్రమా దాన్ని తప్పించేలా చేస్తుంది. ఒకవేళ అప్రమత్తం చేసిన తర్వాత కూడా డ్రైవర్ నిర్లక్ష్యం కొనసాగుతుంటే.. ఆర్టీసీ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఫోన్ కాల్ ద్వారా మరోసారి అప్రమత్తం చేస్తుంది. డ్రైవర్ మానిటరింగ్ సిస్టం (డీఎంఎస్), అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అలర్ట్ సిస్టం (ఏడీఏఎస్)..అనే ఈ రెండింటితో కూడిన వ్యవస్థ కృత్రిమ మేధ (ఏఐ) ఆధారంగా పని చేస్తుంది.
ప్రయోగాత్మకంగా తొలుత 200 బస్సుల్లో దీనిని ఏర్పాటు చేయనున్నారు. ఫలితాలను విశ్లేషించిన తర్వాత అన్ని దూరప్రాంత సర్వీసుల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం టెండర్లు పిలవగా 4 సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. వాటిల్లో రెండింటిని తిరస్కరించిన ఆర్టీసీ.. మిగతా రెండింటి సాంకేతిక పనితీరును పరిశీలిస్తోంది. ఇప్పటికే ఒక్కో సంస్థ రెండు చొప్పున బస్సుల్లో ఈ పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేసి ట్రయల్ ప్రారంభించాయి. వీటిల్లో మెరుగైన సాంకేతికతను అందించే సంస్థతో ఆర్టీసీ ఒప్పందం చేసుకోనుంది. ఆ వెంటనే 200 బస్సుల్లో ఈ వ్యవస్థ ఏర్పాటు కానుంది.
ఎప్పటికప్పుడు బీప్ శబ్దాలతో..
ఎంపిక చేసిన బస్సుల్లో ముందువైపు రెండు ప్రత్యేక సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. ఇందులో ఒకటి డ్రైవర్‌ను, మరోటి రోడ్డును పరిశీలిస్తుంటాయి. అయితే ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉంటాయి. రోడ్డును పరిశీలించే కెమెరా ఏడీఏఎస్‌తో అనుసంధానమై ఉంటుంది. రోడ్డుపై ఉన్నట్టుండి వ్యక్తులు, వాహనాలు అడ్డుగా వచ్చినప్పుడు వెంటనే డ్యాష్‌బోర్డుపై ఉండే సిస్టం నుంచి బీప్ శబ్దం వెలువడుతుంది.
డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తుంది. డ్రైవర్ వేగంతో ప్రమేయం లేకుండా రోడ్డు లేన్‌ను నిర్లక్ష్యంగా మార్చినా, వరసగా ఆవలిస్తున్నా, నిద్రమత్తులో ఉన్నా, తరచూ రెప్ప వాలుస్తున్నా కూడా బీప్ అలర్టులు వస్తాయి. బస్సు నడుపుతూ ఇతరులతో ముచ్చటిస్తున్నా, సెల్‌ఫోన్‌లో మాట్లాడుతున్నా, ఇయర్ ఫోన్లు పెట్టుకుని మాట్లాడుతున్నా కూడా అలెర్ట్ చేస్తుంది. ఇక డీఎంఎస్‌తో అనుసంధానమై ఉండే రెండో కెమెరా డ్రైవర్‌ను పరిశీలిస్తుంటుంది.
ఈ కెమెరా ద్వారా డ్రైవర్ బస్సు నడుపుతున్న తీరును రియల్ టైమ్‌లో చూసే వీలు అధికారులు, సిబ్బందికి కలుగుతుంది. ఇది బస్‌భవన్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానమై ఉంటుంది. డ్రైవర్ నిర్లక్ష్యం కొనసాగుతుంటే, కమాండ్ కంట్రోల్ సెంటర్ సిబ్బందిని ఈ వ్యవస్థ అప్రమత్తం చేస్తుంది. ఆ వెంటనే సిబ్బంది డ్రైవర్‌కు ఫోన్ చేసి అప్రమత్తం చేస్తారు.
అధికారి సెల్‌ఫోన్‌తోనూ అనుసంధానం
డీఎంఎస్ పంపే రియల్ టైమ్ ఫీడ్‌ను నేరుగా సంబంధిత అధికారి సెల్‌ఫోన్‌తో కూడా అనుసంధానిస్తారు. తద్వారా ఆ అధికారి డ్రైవర్ బస్సును నడుపుతున్న తీరును పరిశీలించొచ్చు, అవసరమైతే ఆయనే నేరుగా డ్రైవర్‌కు ఫోన్‌చేసి అప్రమత్తం చేయొచ్చు.
పరిహార భారం నుంచి విముక్తి!
బస్సులకు సంబంధించిన రోడ్డు ప్రమాదాల్లో కొన్ని డ్రైవర్ తప్పిదం వల్ల జరుగుతుంటే, మరికొన్ని ఇతర వాహన డ్రైవర్ల తప్పిదాలతో జరుగుతున్నాయి. అలాంటప్పుడు మృతులు, బాధితుల కుటుంబాలకు ఆర్టీసీ భారీ ఎత్తున పరిహారం అందిస్తోంది. సాలీనా రూ.80 కోట్ల వరకు చెల్లిస్తోంది. ఇది ఆర్టీసీకి పెద్ద భారంగా మారింది. అయితే చాలా సందర్భాల్లో ఆర్టీసీ డ్రైవర్ తప్పు లేనప్పటికీ, ఆర్టీసీ పరిహారం చెల్లిస్తోంది.
ప్రమాదాలకు సంబంధించి సరైన సాక్ష్యాధారాలు లేకపోవటంతో ఇది జరుగుతోంది. ఇప్పుడు అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అలర్ట్ సిస్టం వల్ల ప్రమాదానికి కారణాలు స్పష్టంగా తెలుస్తాయి. ఇది ఆర్టీసీపై అనవసర భారం పడకుండా ఉపయోగపడుతుంది. ప్రమాదాలు నివారిస్తే సంస్థ పురోగతికి, కొత్త బస్సుల కొనుగోలుకు ఆ నిధులను వినియోగించేందుకు వీలుంటుంది.