
ఫేస్‌బుక్ ఖాతా ద్వారా పరిచయమైన యువకుడు
ఓయో రూమ్‌కు తీసుకువెళ్లి రహస్య వీడియోలు
బెదిరింపులతో షీ–టీమ్స్‌ను ఆశ్రయించిన మహిళ
చెక్ చెప్పిన అధికారులు, మూడు రోజుల జైలు
సాక్షి,హైదరాబాద్: ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన మహిళను వేధిస్తున్న యువకుడికి నగర షీ–టీమ్స్ బృందాలు చెక్ చెప్పాయి. ఇతడితో పాటు మరికొందరు పోకిరీలు, నిరాధార ఫిర్యాదులు చేస్తున్న యువతిని పట్టుకున్నట్లు డీసీపీ డాక్టర్ ఎన్‌జేపీ లావణ్య మంగళవారం తెలిపారు. నగరానికి చెందిన ఓ యువకుడు (30) ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన మహిళతో కొన్నాళ్లు స్నేహం చేశాడు. ఆపై ఇరువురూ కలిసి ఓయో రూమ్‌కు వెళ్లగా... సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలను రహస్య కెమెరాతో రికార్డు చేశాడు. ఆపై వాటిని బయటపెడతానంటూ ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు.
అలా కాకుండా ఉండాలంటే తాను చెప్పినట్లు చేయాలంటూ మూడు ఆప్షన్లు ఇచ్చాడు. తాను కోరినప్పుడల్లా రావాలని, తనతో సన్నిహితంగా ఉండటానికి మరికొందరు మహిళలను ఏర్పాటు చేయాలని, రూ.లక్ష ఇవ్వాలని చెప్పిన యువకుడు వీటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలని కోరారు. ఎట్టకేలకు «ధైర్యం చేసిన ఆ మహిళ షీ–టీమ్స్‌ను ఆశ్రయిస్తూ తనకు ఉన్న నాలుగో ఆప్షన్ చూపింది. నిందితుడిని పట్టుకున్న బృందాలు అతడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచాయి. న్యాయమూర్తి అతగాడికి మూడు రోజుల సాధారణ జైలుశిక్ష విధించారు.
బేగంపేటకు చెందిన ఓ యువతి తన సహోద్యోగులతో కలిసి ఓ వేడుక చేసుకున్నారు. దీన్ని వారికి తెలియకుండా పక్క ఇంట్లో ఉండే ప్లంబర్ (34) రికార్డు చేశాడు. మర్నాడు ఆ వీడియోలు చూపిస్తూ మహిళలను బెదిరించడం మొదలెట్టాడు. తనతో సన్నిహితంగా ఉండాలని లేదంటే ఆ వీడియోలు ఆన్‌లైన్‌లో పెడతానని వేధించాడు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన షీ–టీమ్స్ నిందితుడిని పట్టుకుని కోర్టులో హాజరుపరిచాయి. న్యాయస్థానం అతడిని నాలుగు రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో నివసించే యువతి ఇటీవల ప్రజావాణిలో ఓ ఫిర్యాదు చేశారు. ఓ గుర్తుతెలియని వ్యక్తి తనపై లైంగికదాడి చేశారని అందులో పేర్కొన్నారు. ప్రజావాణి నుంచి ఈ ఫిర్యాదు షీ–టీమ్స్‌కు రాగా.. అధికారులు బాధితురాలిని సంప్రదించి గోపాలపురం ఠాణాకు తీసుకువెళ్లారు. కేసు నమోదు చేసిన అధికారులు లోతుగా దర్యాప్తు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమె చేస్తున్న దందా వెలుగులోకి వచి్చంది. పోలీసులనే టార్గెట్‌గా చేసుకుంటున్న ఈ యువతి వివిధ కారణాలు చెప్తూ వారి ఫోన్లు తీసుకుంటుంది. వాటి ద్వారా అశ్లీల చిత్రాలను తన నెంబర్‌కు ఫార్వర్డ్ చేసుకుంటుంది. వీటిని చూపిస్తూ ఆ పోలీసులనే బెదిరించి డబ్బు డిమాండ్ చేస్తుంది. ఈ విషయం వెలుగులోకి రావడంతో ప్రజావాణిలో తప్పుడు ఫిర్యాదు చేసిన ఆరోపణలపై పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.
ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించే జీహెచ్‌ఎంసీ వాహనం డ్రైవర్ ఓ మహిళను వేధించారు. చెత్త వెయ్యడానికి వచ్చే ఆమెను చూస్తూ అభ్యంతరకర, అశ్లీల పనులు చేసేవాడు. దీనిపై బాధితురాలు షీ–టీమ్స్‌లో ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా డెకాయ్ ఆపరేషన్ చేసిన అధికారులు సదరు డ్రైవర్‌ను పట్టుకుని కోర్టులో హాజరుపరిచాయి. న్యాయస్థానం అతడికి నాలుగు రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది.
∙ బాలికలను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి, ఆపై బెదిరింపులకు దిగుతున్న ముగ్గురిని పట్టుకున్న షీ–టీమ్స్ వారిపై పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేయించాయి. ఛత్రినాక, జూబ్లీహిల్స్, మాదన్నపేటలకు చెందిన యువకులు బాలికల్ని ప్రేమ పేరుతో ట్రాప్ చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబరుచుకున్నారు. ఆపై డబ్బు కోసమో, తనతో సన్నిహితంగా ఉండాలనో బ్లాక్‌మెయిల్ చేశారు. దీనిపై ఫిర్యాదులు అందుకున్న షీ–టీమ్స్ నిందితులపై సంబంధిత ఠాణాల్లో పోక్సో కేసులు నమోదు చేయించాయి. మరోపక్క బహిరంగ ప్రదేశాల్లో మహిళలు, యువతుల్ని వేధిస్తున్న 49 మంది పోకిరీలను షీ–టీమ్స్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాయి.