సాధార‌ణ‌ చార్జీలతో.. ఎక్స్‌ప్రెస్ ప్ర‌యాణం! | Telangana’s First Amrit Bharat Express to Run Between Secunderabad and Muzaffarpur from September | Sakshi
Sakshi News home page

తెలంగాణకు మొదటి అమృత్‌ భారత్‌ రైలు

Aug 28 2025 5:58 PM | Updated on Aug 28 2025 6:28 PM

secunderabad to muzaffarpur amrit bharat express to lauch in September

వచ్చే నెలలో అమృత్‌ భారత్‌

సికింద్రాబాద్‌–ముజఫర్‌పూర్‌ మధ్య రాకపోకలు 

ఉత్తరాది వలస కార్మికులు, యాత్రికులకు భారీ ఊరట

తెలంగాణ వైపు తొలిసారిగా అమృత్‌భారత్‌ రైలు పరుగులు పెట్టనుంది. సెప్టెంబ‌ర్‌లో పట్టాలెక్కనుంది. ఉత్తరాది ప్రయాణం నిమిత్తం అందుబాటులోకి రానుంది. తక్కువ చార్జీలుండే అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుతో సామాన్యులు, వలస కార్మికులు తదితర వర్గాల ప్రయాణికులకు భారీ ఊరట కలగనుంది. సికింద్రాబాద్‌ నుంచి బీహార్‌లోని ముజఫర్‌పూర్‌కు అమృత్‌ భారత్‌ రైలును ప్రవేశపెట్టనున్నారు. దేశవ్యాప్తంగా మూడో శ్రేణికి చెందిన ఈ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు రైల్వే బోర్డు కొద్దిరోజుల క్రితమే ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ మేరకు హైదరాబాద్‌ నుంచి పట్నా, గయా తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించేవారి కోసం ఈ రైలును ప్రవేశపెడుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారి ఒకరు తెలిపారు. ఇది కాజీపేట్, పెద్దపల్లి, బెల్లంపల్లి, సిర్పూర్‌కాగజ్‌ నగర్, బల్లార్షా, నాగ్‌పూర్, గోండియా, దుర్గ్, రాయ్‌పూర్, బిలాస్‌పూర్, ఝార్సుగూడ, రూర్కేలా, హతియా, రాంచీ, బొకారో, పరస్‌నాథ్, కోడెర్మా, గయాజీ, జెహనాబాద్, పట్నా తదితర ప్రాంతాల మీదుగా రాకపోకలు సాగించనుంది. ఈ అమృత్‌భారత్‌ (amrit bharat express) రైలులో 11 సాధారణ బోగీలు, 8 స్లీపర్‌ క్లాస్, ఒక ప్యాంట్రీ కార్, 2 సెకండ్‌ క్లాస్‌–కమ్‌–లగేజ్‌–కమ్‌–గార్డ్‌ వ్యాన్‌లు ఉంటాయి. దివ్యాంగుల కోసం ఒక కంపార్ట్‌మెంట్‌ ఉండేవిధంగా రూపొందించారు.

వలస కార్మికులకు ప్రయోజనం... 
హైదరాబాద్‌ నుంచి ముజఫర్‌పూర్‌కు ప్రస్తుతం ఒక్క వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ (05293/05294) మాత్రమే అందుబాటులో ఉంది. ఇది కాకుండా సికింద్రాబాద్‌–దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (12791/12792) ప్రతిరోజు రాకపోకలు సాగిస్తోంది. కానీ, ప్రయాణికుల రద్దీ, డిమాండ్‌ కారణంగా ఈ రైళ్లు ఏ మాత్రం సరిపోవడం లేదు. ప్రతిరోజు దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ నడిచినా మరో రెండు రైళ్లకు సరిపడా ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. హైదరాబాద్‌లో స్థిరపడ్డ లక్షలాది మంది ఉత్తరాది వలస కార్మికుల కుటుంబాలకు ఈ ఒక్క రైలే రాకపోకలకు అనుకూలంగా ఉంది. మరోవైపు అయోధ్యలో రామమందిరం ప్రారంభించిన అనంతరం నగరం నుంచి వెళ్లే భక్తుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ప్రయాగ, వారణాసి తదితర ప్రాంతాలతోపాటు భక్తులు అయోధ్యను సందర్శిస్తున్నారు.

ఇలా అన్ని విధాలుగా డిమాండ్‌ పెరిగినప్పటికీ తగినన్ని రైళ్లు లేకపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అమృత్‌భారత్‌ ద్వారా అతి తక్కువ చార్జీలతోనే ప్రయాణికులు గయ, పట్నా (Patna) తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు అవకాశం లభించనుంది. 2023లో దేశంలో అమృత్‌భారత్‌ రైళ్లను ప్రవేశపెట్టినా సెప్టెంబర్‌లో పట్టాలెక్కనున్న సికింద్రాబాద్‌–ముజఫర్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ తెలంగాణకు మొదటి అమృత్‌ భారత్‌ రైలు కానుంది. సెప్టెంబ‌ర్‌లో జరగనున్న బీహార్‌ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ రైళ్లను పట్టాలెక్కించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. సికింద్రాబాద్‌–ముజఫర్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌తోపాటు మరో 4 రైళ్లు దేశంలోని పలు ప్రాంతాల నుంచి బీహార్‌లోని పలు నగరాలకు నడుపనున్నారు.

మరికొన్ని అమృత్‌ భారత్‌ రైళ్లు...
హైదరాబాద్‌ (Hyderabad) నుంచి మరికొన్ని అమృత్‌భారత్‌ రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. హైదరాబాద్‌– కోల్‌కత్తా (సంత్రాగచ్చి), చర్లపల్లి– గౌహతి, హైదరాబాద్‌–కన్యాకుమారి, సికింద్రాబాద్‌–తిరువనంతపురం మధ్య అమృత్‌భారత్‌ సూపర్‌ఫాస్ట్‌ రైళ్లను నడిపే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. కోల్‌కత్తాకు ప్రవేశపెట్టనున్న రైలును విజయవాడ– విశాఖపట్నం మార్గంలో కాకుండా కాజీపేట్, పెద్దపల్లి, బల్లార్షా మార్గంలో నడపాలని ఉత్తర తెలంగాణకు చెందిన ప్రయాణికులు డిమాండ్‌ చేస్తున్నారు. 

చ‌ద‌వండి:  4 ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 లక్షల ప్యాకేజీతో మ‌రో జాబ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement