
సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో టికెట్ లేకుండా రైళ్లలో ప్రయాణిస్తున్న వారి నుంచి ఒకేరోజు ఏకంగా రూ.కోటికి పైగా మొత్తం జరిమానాగా వసూలు చేశారు. ఒక రోజు జరిపిన తనిఖీలో ఇంతపెద్ద మొత్తం వసూలు కావటం భారతీయ రైల్వేలోనే రికార్డుగా నిలిచింది. దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ ఇతి పాండే ఆదేశం మేరకు.. మంగళవారం జోన్‌లోని సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్లు, గుంటూరు, నాందేడ్ డివిజన్‌లలో సిబ్బంది విస్తృత తనిఖీలు జరిపారు.
టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారిని గుర్తించి 16,105 కేసులు నమోదు చేసి జరిమానాగా రూ.1.08 కోట్లను వసూలు చేశారు. ఈనెల 6న జరిపిన తనిఖీల్లో రూ.92.4 లక్షలు జరిమానాగా వసూలు చేశారు. ఇప్పటి వరకు అదే అత్యధికం. మంగళవారం వసూలు చేసిన జరిమానా మొత్తం భారతీయ రైల్వేలోనే ఒకరోజు గరిష్టం కావటం విశేషం. విజయవాడ డివిజన్ పరిధిలో అత్యధికంగా రూ.36.91 లక్షలు, గుంతకల్లు డివిజన్లో రూ.28 లక్షలు, సికింద్రాబాద్ డివిజన్లో రూ.27.9 లక్షలు, గుంటూరు డివిజన్లో రూ.6.46 లక్షలు, హైదరాబాద్ డివిజన్లో రూ.4.6 లక్షలు, నాందేడ్ డివిజన్లో రూ.4.08 లక్షల చొప్పున జరిమానా వసూలైంది.