
దక్షిణ మధ్య రైల్వే 2025 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో రూ.10143 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. సుమారు 71.14 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసి.. దీని ద్వారా రూ.6635 కోట్ల ఆదాయాన్ని పొందింది. ప్రయాణీకుల ద్వారా రూ.2991 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది.
దక్షిణ మధ్య రైల్వే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో సరుకు రవాణా, ప్రయాణీకుల విభాగాలలో అత్యుత్తమ పనితీరును కనబరిచింది. జోన్ 2025 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రూ.10143 కోట్ల స్థూల ఆదాయాన్ని నమోదు చేసింది. ఇది 2024 - 25లో నమోదైన మునుపటి అత్యుత్తమ ఆదాయమైన రూ. 9966 కోట్ల కంటే 1.7 శాతం ఎక్కువ. ఈ కాలంలో రూ.2991 కోట్ల ప్రయాణీకుల ఆదాయం, రూ.6635 కోట్ల సరుకు రవాణా ఆదాయం దీనికి దోహదపడింది. అదేవిధంగా జోన్ మునుపెన్నడూ లేని విధంగా సరుకు రవాణాలో 71.14 మిలియన్ టన్నుల సరకు లోడింగ్‌ను సాధించింది. ఇది 2024-25లో లోడ్ చేసిన 67 మిలియన్ టన్నుల మునుపటి ఉత్తమ సరుకు రవాణా లోడింగ్ కంటే 6 శాతం ఎక్కువ.
దక్షిణ మధ్య రైల్వే సిబ్బంది అసాధారణ సమిష్టి కృషి, అన్ని విభాగాల మధ్య సమర్థవంతమైన సమన్వయం ఫలితంగా రికార్డు స్థాయి పని తీరును సాధించగలిగింది. జోన్లోని ప్రస్తుత సరుకు రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తూనే, సరుకు రవాణా విభాగంలో నూతన పంథాలను ప్రవేశపెడుతున్నారు. ఈ దిశలో నిరంతర ప్రయత్నం ఫలితంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో జోన్ 71.14 మిలియన్ టన్నుల సరుకు రవాణా వస్తువులను రవాణా చేయడం ద్వారా అత్యుత్తమ సరుకు రవాణాను నమోదు చేసింది. ఇదే కాలంలో గత సంవత్సరంలోని సరుకు రవాణా కంటే ఇది 4.13 మిలియన్ టన్నులు ఎక్కువ (67 మిలియన్ టన్నులు ). ఇనుప ఖనిజం, ఉక్కు కర్మాగారాలకు ముడి పదార్థాలు, సిమెంట్ మొదలైన వస్తువుల లోడింగ్ పెరగడం వల్ల సరుకు రవాణాలో మెరుగుదల ప్రధానంగా ఉంది.
అదే సమయంలో, వీలైనంత వరకు అవసరమైన చోట ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడానికి, నడపడానికి జోన్ ప్రయాణీకుల రవాణా ధోరణులను నిరంతరం పర్యవేక్షిస్తోంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు ప్రవేశపెట్టిన రైళ్లు మంచి ఆదరణతో నడుస్తున్నాయి. అదనంగా, డిమాండ్, సాధ్యాసాధ్యాలు ఉన్న చోట జోన్ అదనపు కోచ్‌లతో రైళ్లను నడుపుతోంది, ప్రత్యేక రైళ్ల నిర్వహణకు అదనంగా దీని వలన వెయిట్‌లిస్ట్ లోనున్న ప్రయాణీకులకు ఉపయోగపడుతోంది. ప్రయాణీకుల ఆదాయం పరంగా, ఈ కాలంలో జోన్ రూ. 2991 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ఇది గత సంవత్సరం గడించిన రూ. 2909 కోట్ల కంటే 2.8 శాతం అధికం.
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ అద్భుతమైన ఆదాయాలను సాధించినందుకు సంతృప్తి వ్యక్తం చేస్తూ దక్షిణ మధ్య రైల్వే బృందాన్ని అభినందించారు. ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఉత్తమ పనితీరును సాధించడానికి అన్ని డివిజన్లు మరియు ప్రధాన కార్యాలయాల సిబ్బంది మరియు అధికారులు ఇదే స్పూర్తితో ఒకే వేగాన్ని కొనసాగించాలని ఆయన సూచించారు.