ఆదివారం ఉదయం మరో రెండు
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్: విమానాలు లేక, ప్రత్యామ్నాయ సర్వీసుల సమాచారం తెలియక అయోమయంలో ఎదురుచూస్తున్న ప్రయాణికుల కోసం రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో శనివారం 74 డిపార్చర్ విమాన సర్వీసులు రద్దు కావటంతో ముఖ్య ప్రాంతాలకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.
⇒ శనివారం రాత్రి 9.35 గంటలకు చర్లపల్లి నుంచి షాలిమార్‌కు స్పెషల్ రైలు నడిపింది. 1566 బెర్తులున్న 14 కోచ్‌లతో ఇది బయలుదేరింది.
⇒ సాయంత్రం 6.40 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి చెన్నై ఎగ్మోర్‌కు మరో ప్రత్యేక రైలు బయలుదేరింది. 1063 బెర్త్‌లతో కూడిన 14 కోచ్‌లను దీనికి ఏర్పాటు చేశారు. ఇది ఉదయం 8 గంటలకు చెన్నై చేరుకుంటుంది.
⇒ నాంపల్లి స్టేషన్ నుంచి శనివారం రాత్రి 8.25 గంటలకు ముంబై లోకమాన్య తిలక్ టెర్మినల్‌కు మరో ప్రత్యేక రైలు బయలుదేరింది. 1080 బెర్తులతో కూడిన 15 కోచ్‌లున్న ఈ రైలు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు ముంబై చేరుకుంటుంది.
⇒ ఆదివారం ఉదయం చర్లపల్లి నుంచి షాలిమార్‌కు , నాంపల్లి స్టేషన్ నుంచి హడప్సర్ (పుణె శివారు)కు మరో ప్రత్యేక రైలు బయలు దేరనుంది. అవసరమైతే మరిన్ని ప్రత్యేక రైళ్లను నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొంటున్నారు.
ఆర్టీసీ బస్సులకు అంతంత మాత్రమే...
పెద్ద సంఖ్యలో విమానాలు రద్దయ్యాయన్న విషయం తెలుసుకొని తెలంగాణ ఆర్టీసీ శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా బెంగళూరు, చెన్నై, ముంబైలకు ప్రత్యేక స్లీపర్ బస్సులను ఏర్పాటు చేసింది. బెంగళూరు కోసం కేవలం నలుగురు ప్రయాణికులు మాత్రమే రావటంతో అంత తక్కువ మందితో బస్సును నడపలేమని, కనీసం 11 మందయినా ఉండాలని అధికారులు సూచించారు. శుక్రవారం రాత్రి చెన్నైకు 11 మందితో ఓ బస్సును నడిపారు. శనివారం కూడా శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి చెన్నై, బెంగళూరుకు ఆర్టీసీ బస్సు సర్వీసులను ప్రారంభించింది. ఎయిర్‌పోర్టు బస్‌టెర్మినల్ నుంచి రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నంకు కూడా అదనపు బస్సులు ఏర్పాటు చేశారు.


