
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు మరో వందేభారత్ రైలు రాబోతోంది. సికింద్రాబాద్–పుణే మధ్య ఇది నడవనుంది. ఈ రెండు నగరాల మధ్య రైలు ప్రయాణికుల సంఖ్య భారీగా ఉన్నందున వందేభారత్ రైలు నడపాలని గతంలోనే నిర్ణయించారు. కానీ, రేక్ అందుబాటులో లేక జాప్యం జరిగింది. తాజాగా హైదరాబాద్ నుంచి పుణేకు నడిపేందుకు రేక్ కేటాయించినట్టు తెలిసింది. నెల రోజుల్లో దాన్ని పట్టాలెక్కించేందుకు రైల్వే బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్–పుణే మధ్య ప్రయాణికుల సంఖ్య భారీగా ఉంది. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య 17 రైళ్లు నడుస్తుండటం విశేషం.
8 గంటల్లోనే..
రెండు నగరాల మధ్య 592 కి.మీ. దూరం ఉంది. సాధారణ రైళ్లు గమ్యం చేరేందుకు 11 గంటల నుంచి 13 గంటల సమయం పడుతోంది. శతాబ్ది రైలు 8.30 గంటలు, దురంతో 8.45 గంటల సమయం తీసుకుంటున్నాయి. ఈ నిడివిని వందేభారత్ ఎక్స్‌ప్రెస్ 8 గంటల్లో చేరుకోనుంది. దీంతో అత్యంత వేగంగా వెళ్లే రైలుగా వందేభారత్ (Vande Bharat) నిలవనుంది.
వందేభారత్ రైలు ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మధ్యాహ్నం పుణేకు చేరుకుంటుంది. అక్కడ మధ్యాహ్నం బయలుదేరి తిరిగి రాత్రి 11 వరకు సికింద్రాబాద్ (Secunderabad) చేరుకుంటుంది. ఈ రైలు సర్వీసు ప్రారంభమయ్యాక డిమాండ్‌ను బట్టి దురంతోను కొనసాగించాలా వద్దా నిర్ణయించనున్నారు.
హైదరాబాద్ నుంచి ఆమ్‌స్టర్‌డ్యామ్‌కు నేరుగా విమాన సర్వీసులు
శంషాబాద్: నెదర్లాండ్స్ రాజధాని ఆమ్‌స్టర్‌డ్యామ్ నగరానికి హైదరాబాద్ (Hyderabad) నుంచి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. కేఎల్‌ఎం రాయల్ డచ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన కేఎల్ 874 విమానం బుధవారం శంషాబాద్ విమానాశ్రయం నుంచి తన తొలి సర్వీసును టేకాఫ్ తీసుకుని అమ్‌స్టర్‌డ్యామ్ నగరంలోని షిపోల్ విమానాశ్రయానికి బయలుదేరింది. హైదరాబాద్ నుంచి సోమ, బుధ, శనివారాల్లో ఈ సర్వీసులు ఉంటాయి. ఆమ్‌స్టర్‌డ్యామ్ షిపోల్ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు ఆది, మంగళ, శుక్రవారాలు విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
చదవండి: మొత్తానికి దొరికారు.. 54 దాడులు, 33 మంది అరెస్ట్
ఢిల్లీ, ముంబై, బెంగళూరు (Bengaluru) తర్వాత భారత్‌లోకి నాలుగో గేట్‌గా ఆమ్‌స్టర్‌డ్యామ్ నుంచి నేరుగా హైదరాబాద్‌కు తమ సర్వీసులు ప్రారంభించినట్లు ఈ సందర్భంగా కేఎల్‌ఎం సీవోవో స్టీవెన్ మార్టెన్ తెలిపారు. దీనిద్వారా ఫార్మా, ఐటీ, పర్యాటక రంగాల్లో పురోగాభివృద్ధికి బాటలు పడతాయని నెదర్లాండ్స్ రాయబారి మారిసా గెరార్డ్స్ అన్నారు. కొత్త కనెక్టివిటీ యూరప్, ఉత్తర అమెరికా బంధాలను మెరుగుపరుస్తుందని ఎయిర్‌పోర్టు సీఈవో ప్రదీప్ ఫణికర్ పేర్కొన్నారు.