
రైళ్లపై రాళ్లు రువ్విన 33 మంది అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: దక్షిణమధ్య రైల్వేలోని వివిధ ప్రాంతాల్లో రైళ్లపై రాళ్ల దాడికి పాల్పడిన 33 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు ఆర్ఫీఎఫ్ అధికారులు తెలిపారు. ఈ ఏడాది జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు మొత్తం 54 రాళ్లదాడులు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఆయా సంఘటనలపై 30 కేసులు నమోదు చేశామన్నారు. రైల్వే ట్రాక్‌లపై ప్రమాద కారకమైన వస్తువులను ఉంచినందుకు నమోదైన 8 కేసుల్లో ఏడుగురిని అరెస్టు చేశారు.
రైళ్లపై రాళ్లు రువ్వడం, ట్రాక్ లపై ప్రమాదకారకమైన వస్తువులను ఉంచడం వంటి నేరాలకు పాల్పడితే రైల్వే చట్టం, ఇతర క్రిమినల్ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. ప్రయాణికుల భద్రత, రైల్వే ఆస్తుల రక్షణకు రైల్వే అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. రైల్వే ఆస్తులపై దాడులకు పాల్పడివారే గురించి 139కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు.
కారు అద్దాలు పగులగొట్టి రూ. 4.79 లక్షలు చోరీ
అత్తాపూర్: కారు అద్దాలు పగులగొట్టి అందులో ఉన్న రూ. 4.79 లక్షలు చోరీ చేసిన సంఘటన అత్తాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ రవి, ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శివరాంపల్లి ప్రాంతానికి చెందిన రాజు లింగయ్యగౌడ్, మైలార్‌దేవ్‌పల్లికి చెందిన దేవదాస్‌గౌడ్ ఉప్పర్‌పల్లి చౌరస్తాలో త్రిబుల్ ఆర్‌వైన్స్ నిర్వహిస్తున్నారు.
ఆదివారం రాత్రి తమ షిఫ్ట్ కారు వెనుక సీట్‌లో కవర్‌లో రూ. 4.79 లక్షల నగదు ఉంచారు. గోల్డెన్ ప్యాలెన్ హోటల్ సర్వీస్ రోడ్డులో కారు పార్క్ చేసి హోటల్‌లో టీ తాగి వచ్చేసరికి కారు అద్దం పగిలి ఉన్నాయి. డబ్బుతో ఉన్న కవర్ కనిపించలేదు. రాజలింగయ్యగౌడ్ ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగినిపై కేసు నమోదు
చందానగర్ సర్కిల్ 21లోని సీఎస్‌సీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ సుభాషిణి 2024–2025 ఆర్థిక సంవత్సరానికి గాను ఆస్తి పన్ను వసూళ్ల డబ్బును బల్దియా అకౌంట్‌లో జమ చేయకుండా సొంతానికి ఉపయోగించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆడిట్ అధికారులు తనిఖీలు చేపట్టడంతో ఆమె తిరిగి రూ.56 లక్షలు బల్డియా అకౌంట్‌లో జమ చేసింది.
ఈ విషయం జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ దృష్టికి వెళ్లడంతో వెంటనే ఆమెను ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటు స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు చందానగర్ సర్కిల్ 21 డిప్యూటీ కమిషనర్ శశిరేఖ సోమవారం చందానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమెపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు.