ఏసీ, నాన్‌ ఏసీ కోచ్‌లలో సదుపాయాల కొరత | Passengers flag poor maintenance of train coaches | Sakshi
Sakshi News home page

ఏసీ, నాన్‌ ఏసీ కోచ్‌లలో సదుపాయాల కొరత

Sep 5 2025 6:28 PM | Updated on Sep 5 2025 7:12 PM

Passengers flag poor maintenance of train coaches

సిబ్బంది కొరత వల్లే సేవల్లో లోపాలు

దూరప్రాంత రైళ్లలో 40 శాతానికిపైగా ఫిర్యాదులు

సకాలంలో నీటిని నింపకపోవడం వల్లే సమస్యలు

సాక్షి, సిటీబ్యూరో: ప్రతిరోజూ సికింద్రాబాద్‌ నుంచి పాట్నాకు వెళ్లే దానాపూర్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (12791) ట్రైన్‌లో సాధారణ ప్రయాణికులతో పాటు కాశీ, ప్రయాగ తదితర పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు వందలాది మంది భక్తులు సైతం బయలుదేరి వెళ్తారు. ప్రయాణికుల రద్దీ, డిమాండ్‌ ఎక్కువ.. పరిశుభ్రత తక్కువ.. బోగీలు, మరుగుదొడ్లు సకాలంలో శుభ్రం చేయకపోవడం వల్ల దుర్వాసన వ్యాపిస్తోందని ప్రయాణికుల నుంచి తరచూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సాధారణ బోగీలు కిక్కిరిసిపోవడంతో కొంతమంది రిజర్వేషన్‌ బోగీల్లోకి అక్రమంగా ప్రవేశిస్తారు. దీంతో బోగీలపై ఒత్తిడి పెరుగుతోంది.

మరోవైపు ఆన్‌బోర్డు సిబ్బంది ఎప్పటికప్పుడు బోగీలను శుభ్రం చేయకపోవడం వల్ల దుర్వాసన ప్రయాణికులను ఠారెత్తిస్తోంది. ఒక్క దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ మాత్రమే కాదు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని దూరప్రాంతాల రైళ్లలో అరకొర సదుపాయాల కారణంగా 40 శాతానికి పైగా ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. ‘తిరుగు ప్రయాణంలో పాట్నా నుంచి రాత్రి 9.30గంటల సమయంలో సికింద్రాబాద్‌కు చేరుకొనే సమయానికి దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌(12792) మరింత దారుణంగా మారుతుంది. మరుగుదొడ్లు, వాష్‌బేసిన్‌లు కంపు కొడతాయి. బోగీల్లోకి బొద్దింకలు వస్తాయి’ అని రామంతాపూర్‌కు చెందిన ఆనంద్‌ విస్మయం వ్యక్తం చేశారు.

నీటి కొరతే కారణమా..? 
హైదరాబాద్‌ నుంచి ప్రతిరోజూ సుమారు 200 రైళ్లు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయి. వాటిలో 85 ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్‌ రైళ్లు దూర ప్రాంతాలకు బయలుదేరుతాయి. సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరే సమయంలో రైళ్లను శుభ్రం చేస్తారు. ఆన్‌బోర్డ్‌ సదుపాయాలు కూడా అందజేస్తారు. కానీ రైళ్లు బయలుదేరిన కొన్ని గంటల తర్వాత ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న కొద్దీ సదుపాయాలు లోపిస్తున్నాయి. నీటి లభ్యత లేకపోవడం వల్ల కొన్ని చోట్ల రైళ్లలో నీటిని నింపడం లేదు. బోగీలను శుభ్రం చేయడం లేదు. దీంతో మరుగుదొడ్లు, వాష్‌బేసిన్లు చెత్తకుప్పలుగా మారుతున్నట్లు ప్రయాణికులు ఫిర్యాదు చేస్తున్నారు. ప్రయాణికుల సదుపాయాలపై కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

దక్షిణ మధ్య రైల్వేలోని పలు ప్రధాన స్టేషన్ల నుంచి బయలుదేరే దూరప్రాంతాల రైళ్లలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. ముఖ్యంగా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి మరే క్రమంలో ఈ నీటి కొరత సవాల్‌గా మారుతుంది. సికింద్రాబాద్‌–విజయవాడ, రేణిగుంట, గుంతకల్, సికింద్రాబాద్‌–గుంటూరు, సికింద్రాబాద్‌–బల్లార్ష, నాందేడ్‌–సికింద్రాబాద్‌ తదితర మార్గాల్లో రాకపోకలు సాగించే దూరప్రాంత రైళ్లలో పరిశుభ్రత లోపిస్తున్నట్లు వెల్లడించింది. సికింద్రాబాద్‌ డివిజన్‌ నుంచి బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తర్‌ ప్రదేశ్‌ తదితర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలోనూ శుభ్రత ఒక సవాల్‌గా మారింది.

అరకొరగా ఆన్‌బోర్డు సేవలు.. 
సాధారణంగా ఏసీ, స్లీపర్‌ బోగీలను ఎప్పటి కప్పుడు శుభ్రం చేసేందుకు ఆన్‌బోర్డ్‌ సిబ్బంది అందుబాటులో ఉంటారు. కానీ చాలా రైళ్లలో ఈ సిబ్బంది అందుబాటులో ఉండటం లేదు. ఐదారు బోగీలకు కేవలం ఒకరిద్దరు మాత్రమే పనిచేస్తారు. ఆన్‌బోర్డు సర్వీసులను అందజేసే ప్రైవేట్‌ సంస్థలు తగినంత మంది సిబ్బందిని నియమించకపోవడం వల్లనే ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. చర్లపల్లి–గోరక్‌పూర్‌ తదితర రైళ్లలో ఆన్‌బోర్డు సర్వీసులు అధ్వాన్నంగా ఉన్నాయని చేవెళ్లకు చెందిన ఫణిరాజ్‌ తెలిపారు. ‘బళ్లార్షాలో నీళ్లు నింపకుండానే కొన్ని రైళ్లు బయలుదేరుతాయి. ఆ తర్వాత మళ్లీ నాగపూర్‌లోనే నీళ్లు నింపేందుకు అవకాశం ఉంటుంది. దీంతో మహిళలు, వృద్ధులు, చిన్న పిల్లలు ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది’ అని చెప్పారు.

మరోవైపు ఆన్‌బోర్డు సేవలను అందజేయడంలో విఫలమైన సంస్థలపైన రైల్వే అధికారులు భారీ ఎత్తున పెనాల్టీలు కూడా విధిస్తున్నారు. ఇలాంటి కాంట్రాక్టర్లు, సంస్థలపై సుమారు రూ.22.5 లక్షల పెనాల్టీ విధించినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికుల నుంచి వచ్చిన 2,265 ఫిర్యాదుల ఆధారంగానే రూ.16.7 లక్షల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. నగరంలోని చర్లపల్లి, సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్‌లలో వాటరింగ్‌ సదుపాయం ఉంది. త్వరలో కాచిగూడలోనూ ఏర్పాటు చేయనున్నట్లు ఒక అధికారి చెప్పారు.

ఆన్‌బోర్డ్‌ సేవలను బలోపేతం చేయాలి 
సరైన సర్వీసులు అందజేయని సంస్థలు, కాంట్రాక్టర్లపై జరిమానాలు విధించడం ఒక్కటే పరిష్కారం కాదు. అలాంటి వారిని తొలగించి సమర్థవంతమైన సేవలు చేసే వారికి బాధ్యతలను అప్పగించాలి. ఆన్‌బోర్డ్‌ సేవల వ్యవస్థను బలోపేతం చేయాలి.  
– శ్రీనివాస్, ప్రయాణికుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement