కరీంనగర్‌లో మరో ఎలక్ట్రిక్‌ బస్సు ప్రమాదం | Fire Breaks Out In Another Electric RTC Bus In Karimnagar, Sparks Safety Concerns After Back To Back Incidents | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌లో మరో ఎలక్ట్రిక్‌ బస్సు ప్రమాదం

Jul 1 2026 6:42 AM | Updated on Jul 1 2026 10:29 AM

Second Telangana Electric Bus Fire in 15 Days Raises Safety Concerns

సాక్షి, కరీంనగర్‌: ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్సుల్లో వరుసగా చోటుచేసుకుంటున్న అగ్నిప్రమాదాలు ప్రయాణికుల్లో ఆందోళన పెంచుతున్నాయి. 15 రోజుల క్రితం అలుగునూర్‌ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఎలక్ట్రిక్‌ బస్సు పూర్తిగా దగ్ధమైన ఘటన మరువకముందే.. తాజాగా కరీంనగర్‌ ఆర్టీసీ బస్టాండ్‌లో నిలిపి ఉన్న మరో ఎలక్ట్రిక్‌ బస్సులో మంటలు చెలరేగాయి. 

మంగళవారం కరీంనగర్‌ ఆర్టీసీ బస్టాండ్‌లో నిలిపి ఉన్న ఎలక్ట్రిక్‌ బస్సు బ్యాటరీ విభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బ్యాటరీలో షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటలు పక్కనే ఉన్న ఇతర బస్సులకు వ్యాపించకుండా సమయానికి చర్యలు చేపట్టడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఘటన సమయంలో బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇదే జిల్లాలో జూన్‌ 21న అలుగునూర్‌ శివారులో కరీంనగర్‌–హైదరాబాద్‌ మార్గంలో వెళ్తున్న ఆర్టీసీ అద్దె ఎలక్ట్రిక్‌ బస్సులో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. డ్రైవర్‌ సమయస్ఫూర్తితో బస్సును రోడ్డు పక్కన ఆపి ప్రయాణికులందరినీ వెంటనే కిందకు దించడంతో 42 మంది సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం బ్యాటరీ బాక్స్‌ నుంచి మంటలు వేగంగా వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. మూడు ఫైర్‌ ఇంజన్లు రెండు గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.

తాజాగా మరోసారి అదే జిల్లాలో ఎలక్ట్రిక్‌ బస్సులో మంటలు చెలరేగడంతో ప్రయాణికుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. వరుస ఘటనల నేపథ్యంలో ఎలక్ట్రిక్‌ బస్సుల నిర్వహణ, బ్యాటరీల నాణ్యత, భద్రతా ప్రమాణాలపై సమగ్ర సాంకేతిక పరిశీలన చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. తాజా ఘటనకు గల ఖచ్చితమైన కారణాలను అధికారులు విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement