Scattered Light Rain Today And Tomorrow In Telangana: IMD - Sakshi
Sakshi News home page

చల్లని కబురు.. నేడు, రేపు అక్కడక్కడా తేలికపాటి వానలు 

May 19 2023 3:09 AM | Updated on May 19 2023 8:56 AM

Scattered light rain today and tomorrow - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తూర్పు మధ్యప్రదేశ్‌ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది సముద్రమట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తువరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని దక్షిణ ప్రాంత జిల్లాల్లో రానున్న రెండ్రోజులు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.

రెండ్రోజులపాటు రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. గురువారం గరిష్ట ఉష్ణోగ్రత నల్లగొండలో 44.0 డిగ్రీలు నమోదు కాగా, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 23.0 డిగ్రీలు నమోదైంది. రాష్ట్రానికి వాయవ్య దిశ నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 

ఏపీలో మండుతున్న సూరీడు  
సాక్షి, అమరావతి: ఏపీలో అధిక ఉష్ణోగ్రతలకు తోడు వేడిగాలులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గురువారం ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరులో అత్యధికంగా 45.1 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగత్ర నమోదైంది. పల్నాడు, శ్రీకాకుళం, వైఎస్సార్‌ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది.

అత్యల్పంగా విశాఖపట్నం (గంభీరం)లో 38.9, కోనసీమ అంబేడ్కర్‌ జిల్లా(అంగర)లో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వైఎస్సార్‌ జిల్లా సింహాద్రిపురం, వల్లూరు మండలంలో తీవ్ర వడగాడ్పులు వీచాయని, మరో 27 మండలాల్లో వడగాడ్పులు వీచాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

శుక్రవారం 29 మండలాల్లో వడగాడ్పుల ప్రభావం ఉండనుంది. అనకాపల్లి జిల్లాలో 5, గుంటూరులో ఒకటి, కాకినాడలో ఒకటి 1, ఎన్టీఆర్‌ జిల్లాలో 2, పల్నాడులో 2, మన్యంలో 5, విజయనగరంలో 5, వైఎస్సార్‌ జిల్లాలో 8 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. శనివారమూ 33 మండలాల్లో  వడగాడ్పులు ఉంటాయని అంచనా వేస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement