
కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల్లో 30 శాతం కట్ చేసిన ప్రభుత్వం
ఉద్యోగుల ఆందోళనతో సాయంత్రం సవరణ ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలోని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల్లో అధికార యంత్రాంగం కోత పెట్టింది. ఏకంగా 30 శాతం మేర తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయా ఉద్యోగుల్లో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఫలితంగా ఉద్యోగులంతా మూకుమ్మడిగా సెలవుపెట్టి నాంపల్లిలోని మైనార్టీ గురుకుల సొసైటీ కార్యాలయాన్ని చుట్టుముట్టి ఆందోళన చేపట్టారు.
ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య, ఇతర బీసీ సంఘాల నేతలు ఆందోళనలో పాల్గొన్నారు. దీంతో దిగివచ్చిన యంత్రాంగం... వేతనాలను పాత పద్ధతిలోనే చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో మధ్యాహ్నం తర్వాత ఆందోళన సద్దుమణిగింది.
సమాచారం లేకుండానే కోత..
కొన్నేళ్లుగా మైనార్టీ గురుకుల సొసైటీ పరిధిలోని పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో వివిధ కేడర్లలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న వీరి సర్వీసును రాష్ట్ర ప్రభుత్వం ఏటా పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన ఏప్రిల్ 1వ తేదీ నుంచి ముగింపు తేదీ మార్చి 31 వరకు వీరి సర్వీసు కొనసాగుతుంది. వేసవి సెలవులు మినహా... మిగిలిన పనిదినాలకు వీరికి ప్రభుత్వం వేతనాలు చెల్లిస్తుంది.
కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఈ ఉద్యోగుల సర్వీసును కొనసాగిస్తూ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా రెండ్రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల్లో 31 కేటగిరీలకు సంబంధించి వేతనాలను కూడా ప్రస్తావించారు. గతేడాది ఈ ఉద్యోగులకు నిర్దేశించిన వేతనాలతో పోలిస్తే దాదాపు 30 శాతం కోతపడింది.
ఇలా దాదాపు అన్ని కేటగిరీల్లో వేతనాలను భారీగా కుదించడంతో తీవ్రస్థాయిలో గందరగోళానికి గురయిన ఉద్యోగులు సొసైటీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉద్యోగులు సెలవు పెట్టి రావడం సొసైటీ అధికారులకు తలనొప్పిగా మారింది. మరోవైపు ప్రభుత్వం నుంచి కూడా తీవ్ర ఒత్తిడి పెరగడంతో వేతనాలను సవరిస్తూ పాతపద్ధతిలోనే చెల్లింపులు చేస్తామని సొసైటీ కార్యదర్శి షఫీయుల్లా ఆందోళన చేస్తున్న ఉద్యోగుల వద్దకు వచ్చి హామీ ఇచ్చారు.