భార్యలు ధర్నా చేస్తే భర్తల్ని సస్పెండ్‌ చేస్తారా? | RS Praveen Kumar comments on Revanth Reddy regarding police duty | Sakshi
Sakshi News home page

భార్యలు ధర్నా చేస్తే.. భర్తల్ని సస్పెండ్‌ చేస్తారా?

Oct 23 2024 4:02 PM | Updated on Oct 23 2024 4:28 PM

RS Praveen Kumar comments on Revanth Reddy regarding police duty

సాక్షి,హైదరాబాద్‌ : మాజీ సీఎం కేసీఆర్ పోలిసుల్ని మనుషులుగా చూస్తే.. సీఎం రేవంత్ రెడ్డి మర మనుషులుగా భావిస్తున్నారని మాజీ ఐపీఎస్‌, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ధ్వ‌జ‌మెత్తారు. 

తెలంగాణలో స్పెషల్‌ పోలీసులు నెలలో 26 రోజులు వరుసగా విధులు నిర్వహించాలి. అనంతరం, నాలుగు రోజులు మాత్రమే సెలవు తీసుకుని వెసులు బాటు ఉంది. దీంతో తమ భర్తలు కుటుంబానికి, పిల్లలికి దూరంగా ఉండాల్సి వస్తుందంటూ నల్గొండలో పోలీస్‌ కుటుంబాలు ఆందోళన బాటపట్టాయి. వారి ఆందోళనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం విధులు నిర్వహిస్తున్న  పోలీసుల్ని సస్పెండ్‌ చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ భ‌వ‌న్‌లో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడారు. 

నల్లగొండలో భార్యలు రోడ్డెక్కితే భర్తలను సస్పెండ్ చేయడం దారుణం. సస్పెండ్ చేసిన కానిస్టేబుల్స్‌ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. పోలీసులే నిరసన చేయటమంటే దేశ భద్రతకు సంబంధించిన అంశంగా చూడాలి. భర్తలు ఇబ్బందులు పడ్తుంటే భార్యలు సమ్మె చేస్తే తప్పేంటి. పోలీసులే సమ్మె చేయటం దేశంలోనే తొలిసారి. 26రోజులు పొడవునా డ్యూటీ చేస్తే 4రోజులు సెలవు ఇస్తామనడం దారుణం. పాత పద్దతిలో 15రోజులు డ్యూటీ చేస్తే..4రోజులు సెలవులు ఇవ్వాలి. 

తెలంగాణ పోలీసుల్లో అశాంతి ఉంది‌. ఇది ప్రమాదకరం. తెలంగాణలో శాంతిభద్రతలు దారుణంగా పడిపోయాయి. హైదరాబాద్‌లో వృద్ద దంపతులను హత్య చేస్తే కనీసం సీసీ టీవీలు పనిచేయటం లేదు. హోంమంత్రిగా రేవంత్ రెడ్డి ఒక్కరోజైనా సమీక్ష చేశారా?.కేటీఆర్, హరీష్ రావు మీద ఎన్ని కేసులు పెట్టారనే దానిపై మాత్రమే రేవంత్ సమీక్ష చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలపై పెట్రోల్ పోయాలన్న మైనంపల్లిపై సుమోటోగా కేసు నమోదు చేయాలి. సీఎం రేవంత్‌ రెడ్డి పరిపాలన మీద కాకుండా రాజకీయ ప్రత్యర్థుల మీద దాడులకే రేవంత్ సమయం కేటాయిస్తున్నారని బీఆర్‌ఎస్‌ నాయకులు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ మండిపడ్డారు. 

Advertisement
 
Advertisement
Advertisement