పార్టీ నిర్మాణం .. ప్రజాందోళనలు

Revanth Reddy meeting with party leaders - Sakshi

టీపీసీసీ ద్విముఖ వ్యూహం 

పార్టీ నేతలతో రేవంత్‌రెడ్డి సమావేశాలు 

2023 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గద్దె దించేలా కార్యాచరణ 

నిరుద్యోగ సమస్యపై నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయం

12న ఎడ్ల బండ్ల ర్యాలీ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ద్విముఖ వ్యూహంతో ముందుకెళ్లాలని తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. ఒకవైపు కేడర్‌లో ఉత్సాహం నింపుతూ సంస్థాగతంగా బలోపేతం కావడంతో పాటు, ప్రజా సమస్యలపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేయా లని ఆ పార్టీ నేతలు నిర్ణయించారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా గురువారం గాంధీభవన్‌లో కీలక సమావేశాలు నిర్వహించారు. రేవంత్‌తో పాటు కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు ఈ సమావేశాలలో పాల్గొన్నారు. ముందుగా కొత్త వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ గౌడ్, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యక్రమాల కమిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ప్రచార కమిటీ కో చైర్మన్‌ అజ్మతుల్లా హుస్సేన్‌తో సమావేశం జరిగింది. ఆ తర్వాత సీనియర్‌ ఉపాధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులతో సమావేశమయ్యారు. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై రేవంత్‌రెడ్డి మార్గనిర్దేశం చేశారు. 

యువత, మహిళల సమస్యలపై పోరాటం 
ప్రధానంగా యువత, మహిళలకు సంబంధించిన సమస్యలపై క్షేత్రస్థాయిలో ప్రత్యక్ష పోరాటానికి ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందని రేవంత్‌ అన్నారు. ఆగస్టులో వివిధ స్థాయిల్లో పార్టీ నేతలకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుందా  మని, పార్టీ సభ్యులకు, నాయకులకు గుర్తింపు కార్డులు ఇద్దామని చెప్పారు. పార్టీని పూర్తిస్థాయిలో సిద్ధం చేసుకుని, 2023 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గద్దె దించి పార్టీని అధికారంలోకి తెచ్చే దిశలో ముందుకెళ్లాలని స్పష్టం చేశారు.  

12న సైకిల్, ఎడ్లబండ్ల ర్యాలీలు 
ఈ సమావేశాల వివరాలను నేతలు మధుయాష్కీ, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, మల్లు రవి, అజ్మతుల్లా హుస్సేన్‌లు మీడియాకు వివరించారు. హుజూరాబాద్‌ ఎన్నికల బాధ్యతలను మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహకు అప్పగించినట్లు మధుయాష్కీ తెలిపారు. పలు ప్రజా సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇందులో భాగంగా నిరుద్యోగ సమస్యపై త్వరలోనే 48 గంటల నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించినట్టు చెప్పారు. పెట్రోల్, డీజిల్‌తో పాటు నిత్యావసరాల ధరల పెంపునకు నిరసనగా ఈనెల 12న అన్ని జిల్లా కేంద్రాల్లో సైకిల్, ఎడ్లబండ్ల ర్యాలీలు నిర్వహించనున్నట్లు మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. నిర్మల్‌లో జరిగే ర్యాలీలో రేవంత్‌రెడ్డి పాల్గొంటారని చెప్పారు. ఈనెల 16న ‘చలో రాజ్‌భవన్‌’చేపడతామన్నారు. పార్టీని నడిపించేందుకు అయ్యే ఖర్చును ప్రతి ఒక్కరూ పంచుకోవాలని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి ప్రతిపాదించినట్లు సమాచారం.

వైఎస్‌కు నివాళి 
ఈ సమావేశాలకు ముందు.. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి 72వ జయంతిని పురస్కరించుకుని, ఆయన చిత్రపటానికి రేవంత్‌ సహా ఇతర నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top