
సాక్షి, హైదరాబాద్: రామంతాపూర్‌లో ఉద్రికత్త చోటుచేసుకుంది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ బాధితుల కుటుంబ సభ్యులు ఆందోళనలకు దిగారు. దీంతో, బాధిత కుటుంబ సభ్యులకు, అధికారులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది.
మరోవైపు.. రామంతాపూర్‌లో పోలీసులు, అధికారులను మృతుల బంధువులు నిలదీస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లిన విద్యుత్ శాఖ సీఎండీని బాధితులు అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. రోడ్డుపై బైఠాయించి కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళన చేపట్టారు.
ప్రమాదంలో చనిపోయిన ఆరు కుటుంబాలకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. చనిపోయిన ప్రతి కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం, ప్రతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలంటూ నినాదాలు చేస్తున్నారు. దీంతో, ఘటనా స్థలంలో భారీగా పోలీసులు మోహరించారు. ఈ క్రమంలో పోలీసులు, మృతుల బంధువులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసలు.. అక్కడున్న వారిని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. రామంతాపూర్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుక విషాదకర ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరుకుంది. ఊరేగింపు రథానికి కరెంట్ తీగలు తగిలి ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో వ్యక్తి చికిత్స పొందుతూ చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. దీంతో, మృతుల కుటుంబాల సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు.