తొలిమాసం.. లోటు వర్షపాతం.. | The rains have stopped in the first month of the southwest monsoon season | Sakshi
Sakshi News home page

తొలిమాసం.. లోటు వర్షపాతం..

Jun 30 2026 4:21 AM | Updated on Jun 30 2026 4:21 AM

The rains have stopped in the first month of the southwest monsoon season

నైరుతి రుతుపవనాల సీజన్‌ మొదటి నెలలో వానలు అంతంతే 

సాధారణ వర్షపాతం 13.03 సెం.మీ., నమోదైంది 11.3 సెం.మీ. 

సాక్షి, హైదరాబాద్‌: నైరుతి రుతుపవనాల సీజన్‌ మొదటి నెల నిరాశే మిగిల్చింది. ఎలినినో ప్రభావంతో రాష్ట్రంలోని చాలాప్రాంతాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నమోదయ్యాయి. జూన్‌ 1 నుంచి సెపె్టంబర్‌ 30 వరకున్న కాలాన్ని నైరుతి రుతుపవనాల సీజన్‌గా పరిగణిస్తారు. సీజన్‌లో తొలి మాసమైన జూన్‌లో ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 14 శాతం తక్కువగా వర్షాలు కురిశాయి. నైరుతి రుతుపవనాలు జూన్‌ 8న రాష్ట్రంలోకి ప్రవేశించాయి. 

తొలివారం కొంత చురుకుగా ముందుకు సాగినప్పటికీ... ఆ తర్వాత మందగించడంతో రుతుపవనాల వ్యాప్తి జూన్‌ మూడో వారం నాటికి రాష్ట్రమంతటికీ విస్తరించగా... ఆ తర్వాత వర్షాలు నమోదయ్యాయి. జూన్‌లో రాష్ట్రంలో 13.03 సెం.మీ. సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... ఇ ప్పటివరకు 11.3 సెం.మీ. వర్షపాతమే నమోదైంది. సాధారణ వర్షపాతం కంటే 14 శాతం తక్కువగా వానలు కురిశాయి. గతేడాది జూన్‌లో 9.37 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా... 21 శాతం లోటు నమోదైంది. 

16 జిల్లాల్లో లోటు వర్షపాతం 
ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్‌ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నమోదయ్యాయి. హనుమకొండ జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నమోదయ్యాయి. ఇక్కడ 75 శాతం లోటు నమోదైనట్లు రాష్ట్ర ప్రణాళిక శాఖ వెల్లడించింది. మరో 15 జిల్లాల్లో లోటు వర్షాలు కురిశాయి. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో సాధారణ వర్షాలు నమోదు కాగా... మరో 5 జిల్లాల్లో అధిక వర్షాలు కురిశాయి. 

గతేడాదితో పోలిస్తే సగటు వర్షపాతం మెరుగ్గా కనిపిస్తున్నా... వర్షాలు ఆలస్యం కావడం... కీలకమైన జిల్లాల్లో తేలికపాటి వానలే కురవడంతో సాగు పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. జూన్‌లో అరకొర వర్షాలు నమోదుకాగా.. వచ్చే నెల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రధానంగా మధ్య, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు ఆశించినస్థాయిలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

ఏ జిల్లాలో ఎలా ఉందంటే... 
తీవ్ర లోటు: హనుమకొండ 
లోటు: ఆదిలాబాద్, మంచిర్యాల, ని జామాబాద్, జగిత్యాల, వరంగల్, క రీంనగర్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగామ, యాదాద్రి భువనగిరి, మేడ్చల్‌–మల్కాజిగిరి, జోగులాంబ గద్వాల, వనపర్తి 
సాధారణం: కుమ్రుంభీం ఆసిఫాబాద్, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబుబాబాద్, సంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, మహబూబ్‌నగర్, ములుగు, నారాయణపేట్‌ 
అధికం: రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం

జూన్‌.. అసాధారణం
దేశంలో వర్షపాతం కేవలం 85.2 మి.మీ. 
గత 125 ఏళ్లలో ఇలా జరగడం ఐదోసారి 
దక్షిణాది రాష్ట్రాల్లో 31 శాతం లోటు 
న్యూఢిల్లీ, సాక్షి ప్రతినిధి: అసాధారణ వాతావరణ పరిస్థితులతో ఈ ఏడాది జూన్‌ నెల ప్రజలను అల్లాడించింది. ఈ నెలలో వాతావరణం సాధారణానికి భిన్నంగా, ఆందోళనకరంగానే కనిపించింది. దేశవ్యాప్తంగా జూన్‌ 1 నుంచి 28 వరకు కురవాల్సిన సాధారణ వర్షపాతం 149.8 మి.మీ. కాగా, కేవలం 85.2 మి.మీ. మాత్రమే నమోదైంది. సుమారు 43 శాతం లోటు ఏర్పడింది. 

భార త వాతావరణ శాఖ (ఐఎండీ) తాజా నివేదిక ప్రకారం, ఇలాంటి వాతావరణ పరిస్థితు లు ఏర్పడటం గత 125 ఏళ్లలో ఇది ఐదోసారి. జూన్‌లో 100 మి.మీ. కంటే తక్కువగా వర్షపాతం నమోదుకావడమనేది గతంలో 1905, 1926, 2009, 2014 సంవత్సరాలలో మాత్రమే జరిగింది. నైరుతి రు తుపవనాలు కేరళను కొంచెం ఆలస్యంగా జూన్‌ 4న తాకినప్పటికీ, ఆ తర్వాత దేశవ్యాప్తంగా వాటి విస్తరణ పూర్తిగా మందగించింది.  

భారీ లోటు వర్షపాతం... 
ప్రాంతాల వారీగా చూస్తే, మధ్య భారతదేశంలో అత్యధికంగా 56 శాతం లోటు ఏర్పడింది. ఈశాన్య రాష్ట్రాల్లో 43 శాతం, దక్షిణాదిలో 31 శాతం, వాయవ్య రాష్ట్రాల్లో 29 శాతం లోటు నమోదైంది. వాతావరణ శాఖ రికార్డుల ప్రకారం, 1901 సంవత్సరం తర్వాత ఈ జూన్‌ మూడవ అత్యంత పొడి నెలగా నిలిచింది. ఇంతటి తీవ్ర వర్షపాత లోటు ఏర్పడటం 2009 తర్వాత మళ్లీ ఇప్పుడే నమోదైంది. 

ఎల్‌నినో ప్రభావం కొంతమేర ఉన్నప్పటికీ... హిందూ మహాసముద్ర డైపోల్‌ తటస్థంగా ఉండటం, భూమధ్యరేఖ ప్రాంతంలో వర్షాలను ఇచ్చే మేఘాల వ్యవస్థ భారత్‌కు అనుకూలమైన దిశలో లేకపోవడం, బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడకపోవడం, వాయవ్య భారతం నుంచి వీచిన వేడిగాలులు క్లౌడ్‌ ఫార్మేషన్‌ను అడ్డుకోవడం వంటి పరిస్థితుల వల్ల రుతుపవనాలు స్తంభించిపోయాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.  

315 జిల్లాలు ప్రభావితం 
దేశంలో 724 జిల్లాలకుగాను 315 జిల్లాలు తక్కువ వర్షపాతం వల్ల ప్రభావితమయ్యే అవకాశం ఉందని కేంద్రం గుర్తించింది. వాటిలో 25 శాతం కంటే తక్కువ నీటి పారుదల సౌకర్యం ఉన్న 111 జిల్లాలను ‘అత్యంత అప్రమత్తత’జిల్లాలుగా ప్రకటించింది. ఆ జిల్లాల జాబితాలో తెలంగాణ సహా 12 రాష్ట్రాలకు చెందిన జిల్లాలు ఉన్నాయి. వాటి కోసం ‘డిస్ట్రిక్ట్‌ అగ్రికల్చర్‌ కాంటింజెన్సీ ప్లాన్స్‌’సిద్ధం చేశారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement