
హైదరాబాద్: పుష్ప-2 ప్రివ్యూ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై వివరణ కోరుతూ తెలంగాణ చీఫ్ సెక్రటరీకి బుధవారం నోటీసులు జారీ చేసింది. అదే సమయంలో బాధిత కుటుంబానికి పరిహారం అందించే విషయంలోనూ కీలక ఆదేశాలూ జారీ చేసింది.
పుష్ప 2 చిత్ర ప్రివ్యూ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో చిన్నారి తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఇవాళ మానవ హక్కుల కమిషన్‌లో విచారణ జరిగింది. ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొంటూ సీఎస్‌కు నోటీసులు పంపించింది. అలాగే.. చనిపోయిన బాధితులకు రూ. 5 లక్షల రూపాయాలు చెల్లించాలని బాధ్యులకు, అలాగే వ్యవహారంపై నివేదిక సమర్పించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
కిందటి ఏడాది డిసెంబర్ 4వ తేదీన పుష్ప-2 చిత్ర ప్రీమియర్ షోను సంధ్యా థియేటర్‌లో ప్రదర్శించారు. అయితే అక్కడి బెనిఫిట్ షో కోసం అల్లు అర్జున్ రావడంతో భారీగా అభిమానులు చేరడంతో తొక్కిసలాట జరిగింది. ఈ విషాద ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. శ్రీతేజ్‌కి చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 146 రోజులు పాటు వైద్యం అందించారు. చివరకు 2025 ఏప్రిల్ 29న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు, కానీ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఈ ఘటనకు సంబంధించి నటుడు అల్లు అర్జున్ అరెస్టైన సంగతీ తెలిసిందే.