రేపట్నుంచి ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ షురూ | Process Of Transfers Of Government Employees Will Start From Tomorrow In Telangana, More Details Inside | Sakshi
Sakshi News home page

రేపట్నుంచి ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ షురూ

Jul 4 2024 5:02 AM | Updated on Jul 4 2024 10:32 AM

Process of transfer of government employees will start from tomorrow

సాధారణ బదిలీలపై ఉన్న నిషేధం ఎత్తివేసిన రాష్ట్ర ప్రభుత్వం

రెండేళ్లలోపు వారికి అవకాశం లేదు.. నాలుగేళ్లు అయితే తప్పనిసరి  

మొత్తం ఉద్యోగుల్లో 40% మించకూడదు  

ఈ నెల 5వ తేదీ నుంచి రోజువారీ షెడ్యూల్‌ 

ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థికశాఖ

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు లైన్‌క్లియర్‌ అయ్యింది. బదిలీలపై ఉన్న నిషేధం ఎత్తివేస్తూ ఈనెల 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి కె.రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం..ఈ ఏడాది జూన్‌ 30వ తేదీ నాటికి ఒక ఉద్యోగి కనీసం రెండేళ్లు ఒకేచోట పనిచేసి ఉంటే బదిలీకి అర్హుడు. ఇక నాలుగేళ్లు ఒకే చోట పనిచేసిన ఉద్యోగికి బదిలీ తప్పనిసరి. 

ప్రత్యేక పరిస్థితి ఉంటే తప్ప నాలుగేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగికి బదిలీ నుంచి మినహాయింపు ఉండ దని, గరిష్టంగా 40%ఉద్యోగులకు మించకుండా బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. స్పౌజ్‌ కేటగిరీ, 2025 జూన్‌ 30వ తేదీ నాటికి పదవీవిరమణ పొందే ఉద్యోగులు, 70 శాతం డిజెబిలిటీ లేదా అంతకంటే ఎక్కువశాతం డిజెబిలిటీ ఉన్న ఉద్యోగులు, మానసిక వైకల్యంతో కూడిన పిల్లలున్న ఉద్యోగులు, వితంతువులు, మెడికల్‌ గ్రౌండ్స్‌ ఉన్న ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యం ఇస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. 

బదిలీ ప్రక్రియ ఇలా... 
బదిలీ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు శాఖాధి పతి ప్రభుత్వం ఇచ్చిన బదిలీల ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. 
– శాఖల వారీగా హెచ్‌ఓడీ సంబంధిత ఉద్యోగుల సీనియారి టీ జాబితా ప్రచురించాలి.  
– ఉద్యోగి పనిచేస్తున్న స్థానం, పదవీకాలంతో సహా చెప్పాలి.  
– శాఖలో ఉన్న ఖాళీల జాబితా కూడా ప్రచురించాలి. 
– తప్పనిసరి బదిలీ కేటగిరీలో ఉన్న ఉద్యోగుల వివరాలు కూడా ప్రత్యేకంగా ప్రకటించాలి.  
– బదిలీలకు సంబంధించి 5 ఐచ్చికాలను ఉద్యోగుల నుంచి తీసుకోవాలి.  
– ప్రభుత్వం ఆప్షన్‌ పత్రాన్ని ప్రకటించింది. అయితే శాఖాపరంగా ఈ ఆప్షన్‌ పత్రాన్ని మార్పు చేసుకునే వెసులుబాటు కల్పించింది.  
– బదిలీల ప్రక్రియతో ప్రతి కార్యాలయంలో కనీస సిబ్బంది ఉండేలా చూడాలి.  
– అవకాశం ఉన్నచోట ఆన్‌లైన్, వెబ్‌ కౌన్సెలింగ్‌ పద్ధతిలో బదిలీలు చేపట్టాలి.  
– ప్రభుత్వం జారీ చేసిన బదిలీల విధానానికి అనుగుణంగా విద్య, రెవన్యూ, వైద్య,ఆరోగ్య తదతర శాఖలు కూడా ఉద్యోగులబదిలీలకు పూర్తిస్థాయి మార్గదర్శకాలు జారీ చేస్తాయి. అయితే ప్రభుత్వ అనుమతితో మార్గదర్శకాల్లో సవరణలు కూడా చేసుకోవచ్చు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement