ఆ రాష్ట్ర వాటా కింద ఇంకా 2.45 టీఎంసీల జలాలే మిగిలి ఉన్నాయి
ప్రస్తుత వినియోగమే కొనసాగితే రెండురోజుల్లో వాటా మిగలదు
ఆపై నీళ్లు తీసుకోకుండాఆ రాష్ట్రాన్ని కట్టడి చేయండి
కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ
శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో మిగిలిన నిల్వలకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రస్తుత నీటి సంవత్సరంలో ఇప్పటికే 661 టీఎంసీల కృష్ణా జలాలను వాడుకోగా, ఆ రాష్ట్ర వాటా కింద ఇంకా 2.45 టీఎంసీల జలాలే మిగిలి ఉన్నాయని తెలంగాణ స్పష్టం చేసింది. ప్రస్తుతం రోజుకి 1.5 టీఎంసీల చొప్పున కృష్ణా జలాలను ఏపీ తరలించుకుంటుండగా, ఇదే వినియోగం కొనసాగితే రెండు రోజుల్లో ఆ రాష్ట్ర వాటా నీళ్లు మిగలకుండా అయిపోతాయని తెలిపింది. కాబట్టి ఆ తర్వాత నీళ్లు తీసుకోకుండా ఆ రాష్ట్రాన్ని కట్టడి చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ)కు తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
తమ రాష్ట్ర హక్కుగా లభించాల్సిన వాటా జలాలను పూర్తిగా తామే వాడుకుంటామని, ఇందుకుగాను ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో మిగిలిన నిల్వలకు రక్షణ కల్పించాలని కోరింది. ఈ విషయంపై చర్చించడానికి సత్వరమే బోర్డు సమావేశాన్ని నిర్వహించాలని కోరింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) మహమ్మద్ అంజాద్ హుస్సేన్ గురువారం మరో లేఖ రాశారు. ప్రాజెక్టుల వారీగా ఇరు రాష్ట్రాలు వాడుకున్న నీటి లెక్కలను ఆ లేఖలో తెలంగాణ పొందుపరిచింది.
ఏడాదిలో మూడో లేఖ
ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీ అంశం కృష్ణా ట్రిబ్యునల్–2లో అపరిష్కృతంగా ఉండడంతో రెండు రాష్ట్రాల మధ్య 66:34 నిష్పత్తిలో కృష్ణా జలాలను పంపిణీ చేయాలని 2015లో తాత్కాలిక సర్దుబాటు పేరుతో కేటాయింపులు చేశారు. ఈ క్రమంలో ప్రస్తుత నీటి సంవత్సరంలో రెండు రాష్ట్రాలు కలిపి బుధవారం నాటికి 833 టీఎంసీల జలాలను వాడుకోగా, ఏపీ 661.42 టీఎంసీలు (79.33 శాతం), తెలంగాణ 172.37 టీఎంసీలు (20.67శాతం) వాడుకున్నట్టు లేఖలో తెలంగాణ స్పష్టం చేసింది.
ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయంలో కనీస నిల్వ మట్టానికి ఎగువన 183.01 టీఎంసీల నీటి లభ్యతగా ఉండగా, అందులో తెలంగాణ వాటా 180.55 టీఎంసీలు ఉంటే, ఏపీ వాటా 2.45 టీఎంసీలు మాత్రమే మిగిలి ఉన్నాయని తేల్చి చెప్పింది. ఏపీ వాటాకు మించి కృష్ణా జలాలను వినియోగించుకుంటోందని ఫిర్యాదు చేస్తూ తెలంగాణ లేఖ రాయడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి కావడం గమనార్హం.
కట్టడి చేయమంటే వాడకం పెంచిన ఏపీ..
ఏపీ వాడకం పోగా ఆ రాష్ట్ర కోటా కింద 20 టీఎంసీల కృష్ణా జలాలే మిగిలి ఉన్నాయని, ప్రస్తుత సంవత్సరంలో అంతకు మించి నీళ్లు తీసుకోకుండా ఆ రాష్ట్రాన్ని కట్టడి చేయాలని ఈ నెల 17న తాము రాసిన లేఖను కృష్ణా బోర్డు తగిన చర్యల కోసం ఏపీకి పంపించగా, ఆ రాష్ట్రం ఆశ్చర్యకర రీతిలో వినియోగాన్ని మరింత ఉధృతం చేసిందని తెలంగాణ ఆరోపించింది.
నాగార్జునసాగర్ కుడికాల్వతో పాటు శ్రీశైలం జలాశయం నుంచి హంద్రీ నీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్) ద్వారా భారీగా నీళ్లను తరలించుకుంటోందని ఆందోళన వ్యక్తం చేసింది. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ద్వారా శ్రీశైలం జలాశయం 875.50 అడుగుల వద్ద నుంచి నీళ్లు తీసుకునేందుకు అవకాశం ఉన్నా, ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా కేసీ కాల్వకు నీటి తరలింపును ఈ నెల 26 నుంచి ప్రారంభించిందని అభ్యంతరం తెలిపింది.


