మునిసిపల్ ఎన్నికల్లో అత్యంత కీలక ఘట్టం పూర్తి
121 మునిసిపల్ చైర్మన్, 10 మేయర్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు
గెజిట్లు సైతం జారీ.. ఎన్నికల సంఘం పోర్టల్‌లో అప్‌లోడ్
ఇప్పటికే పోలింగ్‌స్టేషన్ల వారీగా ఫొటో ఓటరు తుది జాబితా ప్రచురణ
నేడు కేబినెట్ భేటీలో చర్చ..షెడ్యూల్‌పై నిర్ణయం!
అన్ని కేటగిరీలు కలిపి
మహిళలకు 50% రిజర్వేషన్లు
జీహెచ్‌ఎంసీ మేయర్ పదవి జనరల్ మహిళకు బీసీలకు 38 మునిసిపల్ చైర్మన్, 3 మేయర్ పదవులు
మునిసిపాలిటీల్లో వార్డులు, కార్పొరేషన్లలో డివిజన్ల వారీగా రిజర్వేషన్లు ఖరారు
సాక్షి, హైదరాబాద్: మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్ల సాధారణ ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలకమైన ఘట్టాన్ని పురపాలక శాఖ పూర్తి చేసింది. రాష్ట్ర స్థాయిలో పురపాలక శాఖ డైరెక్టర్ సమక్షంలో 121 మునిసిపల్ చైర్మన్, 10 మేయర్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ప్రక్రియ పూర్తి చేసినట్లు పురపాలక శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి ప్రకటించారు. ఇప్పటికే పోలింగ్‌స్టేషన్ల వారీగా ఫొటో ఓటరు తుది జాబితాను ప్రచురించారు. తాజాగా రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 20వ తేదీన మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.
డ్రా పద్ధతిలో మహిళా రిజర్వేషన్లు
అన్ని కేటగిరీలు కలిపి మహిళలకు 50 శాతం మునిసిపల్ చైర్మన్, మేయర్ పదవులు కేటాయించారు. నగరాలు, పట్టణాల వారీగా ఏ కేటగిరీకి ఏది రిజర్వు చేశారనే వివరాలను వెల్లడించారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో వివాదాలకు తావులేకుండా డ్రా పద్ధతిలో కేటగిరీల వారీగా మహిళా రిజర్వుడు స్థానాలను నిర్ణయించారు. రొటేషన్ పద్ధతిలో మునిసిపల్ చైర్మన్, మునిసిపల్ వార్డులు, మేయర్, డివిజన్ల రిజర్వేషన్లు ఖరారు చేశారు. జిల్లా స్థాయిలోనూ కలెక్టర్ల ఆధ్వర్యంలో రిజర్వేషన్లు నిర్ణయించారు.
రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఖరారు చేసిన రిజర్వుడు స్థానాల వివరాలతో గజిట్లు జారీ చేయడంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం పోర్టల్‌లో అప్‌లోడ్ చేశారు. ఇవే వివరాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మునిసిపల్ శాఖ కార్యదర్శి పంపించారు. వాటిని పరిశీలించి ముఖ్యమంత్రి ఆమోదం పొందిన తర్వాత ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాస్తారని పురపాలక శాఖ వర్గాలు వెల్లడించాయి.
నేడు కేబినెట్ భేటీలో షెడ్యూల్‌పై చర్చ
ఆదివారం మేడారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్‌పై చర్చించే అవకాశముంది. కేబినెట్ ఆమోదంతో మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు మార్గం సుగమం కానుంది. ఈ నెల 19న పురపాలక సంఘాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారం¿ోత్సవాలు, శంకుస్థాపనల వంటివి ప్రభుత్వం చేపట్టనుంది. అనంతరం ఈ నెల 20న రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించే అవకాశమున్నట్లు సమాచారం. మునిసిపల్ ఎన్నికలు ఒకే విడతలో బ్యాలెట్ పద్ధతిలో జరగనున్నాయి. ఇప్పటికే బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ మెటీరియల్, సిబ్బందికి శిక్షణ వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. 
ఎస్సీ, ఎస్టీలకు ఒక్కో మేయర్ పదవి
రాష్ట్రంలోని పది మేయర్ స్థానాలకు గాను గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) సహా మరో నాలుగు మునిసిపల్ కార్పొరేషన్లను అన్ రిజర్వుడు (జనరల్) కేటగిరీకి రిజర్వు చేశారు. ఈ కేటగిరీలో కేవలం గ్రేటర్ వరంగల్ ముసినిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) మినహా మిగతా నాలుగు కార్పొరేషన్లు..జీహెచ్‌ఎంసీ, ఖమ్మం, నిజామాబాద్, నల్లగొండను జనరల్ మహిళ కేటగిరీకి రిజర్వు చేశారు. బీసీలకు మూడు మేయర్ పదవులు రిజర్వు కాగా మంచిర్యాల, కరీంనగర్ బీసీ జనరల్, మహబూబ్‌నగర్‌ను బీసీ మహిళకు రిజర్వు చేశారు. ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు ఒక్కో మేయర్ పదవిని కేటాయించారు.
కొత్తగూడెంను ఎస్టీ జనరల్, రామగుండంను ఎస్సీ జనరల్‌కు రిజర్వు చేశారు. 300 డివిజన్లతో కూడిన జీహెచ్‌ఎంసీ మేయర్ పదవి ప్రస్తుతం జనరల్ మహిళకు రిజర్వు అయ్యిందని, అయితే భవిష్యత్తులో జీహెచ్‌ఎంసీని ఎన్ని కార్పొరేషన్లుగా విభజిస్తారో తమకు ఇప్పటివరకు సమాచారం లేదని శ్రీదేవి చెప్పారు. ఇదిలా ఉంటే మునిసిపాలిటీల్లో బీసీలకు 38 మునిసిపల్ చైర్మన్ పదవులు రిజర్వు కాగా ఇందులో బీసీ జనరల్‌కు 19, బీసీ మహిళకు 19 చొప్పున కేటాయించారు. జనరల్ కోటాలో 61 కేటాయించగా అందులో జనరల్‌లో 30, జనరల్ మహిళలకు 31 మునిసిపల్ చైర్‌పర్సన్ స్థానాలను రిజర్వ్ చేశారు. ఎస్టీలకు 5 మునిసిపాలిటీలు కేటాయిస్తే... మహిళలకు రెండు, ఎస్టీ జనరల్‌కు మూడింటిని రిజర్వ్ చేశారు. ఎస్సీ కోటాలో మొత్తం 17 మునిసిపాలిటీలను కేటాయిస్తే.. 9 ఎస్సీ జనరల్, 8 ఎస్సీ మహిళలకు కేటాయించారు.


