సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వచ్చిన రెండేళ్లు పూర్తైనా ఒక్క ఫ్లైఓవర్ అయినా కట్టారా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ప్రశ్నించారు. నాటి వైఎస్సార్ హయాం నుంచి బీఆర్‌ఎస్ పాలన దాకా ఏనాడూ సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బ తీసే ప్రయత్నాలు జరగలేదని.. కానీ, ఇప్పుడు రేవంత్ ఆ పని చేస్తున్నాడని కేటీఆర్ మండిపడ్డారు.
శనివారం తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో సికింద్రాబాద్ బచావో యాత్ర జరగాల్సి ఉంది. అయితే అర్ధరాత్రి ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు సమాచారం అందించారు. అయినప్పటికీ బీఆర్‌ఎస్ శ్రేణులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకునే ప్రయత్నాలు చేయగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తెలంగాణ భవన్ వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
‘‘తుగ్లక్ పేరు పుస్తకాల్లో చదువుకున్నాం.. ఇప్పుడు చూస్తున్నాం. TS నుంచి TG గా మారిస్తే ఎవరికి లాభం జరిగింది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చివేశారు. తెలంగాణ తల్లిని రూపుమాపి.. కాంగ్రెస్ తల్లిని ప్రతిష్టించారు. కాకతీయ కళాతోరణం తీసివేస్తున్నారు. అపసవ్య దిశలో పాలన సాగుతోంది. సికింద్రాబాద్, హైదరాబాద్ మధ్య విడదీయలేని బంధం ఉంది. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బ తీయాలనుకోవడం మంచిది కాదు.
వైఎస్ఆర్ ఆనాడు ఎంసీహెచ్‌ను విస్తరించినా.. హైదరాబాద్ అస్థిత్వాన్ని ముట్టుకోలేదు. బీఆర్‌ఎస్ పాలనలో హైదరాబాద్ అస్థిత్వాన్ని దెబ్బతీసేవిధంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2016లో జిల్లాలు ఎర్పాటు అయ్యి పాలన సెట్ అవుతున్న సందర్భంలో జిల్లాలను తొలగించాలని అనుకోవడం తుగ్లక్ చర్యే. తుగ్లక్ సర్కార్‌కు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెబుతాం. సికింద్రాబాద్ ప్రజల మనోభావాల్ని బీఆర్‌ఎస్ గౌరవిస్తుంది. మేం అధికారంలోకి వచ్చాక జిల్లాగా ఏర్పాటు చేస్తాం.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయ్యింది. ఆరు గ్యారెంటీలు అటకెక్కించారు. జంట నగరాల్లో ఒక్క ఫ్లైఓవర్ అయినా కట్టారా?. కనీసం.. ఒక్క రోడ్డు వేయలేదు. రేవంత్‌కు తెలిసింది ఒక్కటే.. విధ్వంసం. శాంతి ర్యాలీనీ అడ్డుకోవడం దుర్మార్గపు చర్య. మా పార్టీకి చెందిన 8 వేల మంది కార్యకర్తలను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయినవారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అధికారం ఎవరికి శాశ్వతం కాదు అనేది రేవంత్ గుర్తు పెట్టుకోవాలి. లేకుంటే.. కాంగ్రెస్ పార్టీ శాశ్వతంగా తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతుంది అని కేటీఆర్ అన్నారు.


