జీ రామ్‌ జీపై సుప్రీంకు.. | Ponguleti Srinivasa Reddy reveals cabinet decisions | Sakshi
Sakshi News home page

జీ రామ్‌ జీపై సుప్రీంకు..

Jul 3 2026 2:08 AM | Updated on Jul 3 2026 2:08 AM

Ponguleti Srinivasa Reddy reveals cabinet decisions

కేబినెట్‌ నిర్ణయాలను వెల్లడిస్తున్న మంత్రి పొంగులేటి. చిత్రంలో మంత్రులు అడ్లూరి, సీతక్క

గత్యంతరం లేక రాష్ట్రంలో కొత్త ఉపాధి చట్టం అమలుకు పచ్చజెండా 

కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు  

ఈ చట్టం సమాఖ్య విధానానికి, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని నిరసన 

బడులు, జూనియర్‌ కాలేజీల బోధనా సిబ్బందికీ అల్పాహారం, పాలు, లంచ్‌ 

రాష్ట్రంలో లక్షన్నర మంది గురువులకు భోజన సదుపాయం  

నాలుగు టిమ్స్‌ ఆస్పత్రులకు 6,278 పోస్టులు మంజూరు 

కర్కాలపహాడ్, బొల్లికుంటలో భారీ గోదాముల నిర్మాణం 

నవోదయ పాఠశాలలకు స్థలాలు 

మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి పొంగులేటి

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన వీబీ–జీ రామ్‌ జీ (వికసిత్‌ భారత్‌– గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్, ఆజీవికా మిషన్‌–గ్రామీణ్‌)చట్టం–2026ను జూలై 1 నుంచి రాష్ట్రంలో అమల్లోకి తెచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉపాధి హామీ కూలీలకు పని కల్పించే విషయంలో గత్యంతరం లేక నోటిఫికేషన్‌ జారీకి ఈమేరకు కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఈ చట్టంలో విధించిన నిబంధనలపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది. పార్లమెంటులోనూ కేంద్రం తీరును నిలదీయాలని తీర్మానించింది. గురువారం ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గం సమావేశమై వీబీ–జీ రామ్‌ జీని రాష్ట్రంలో అమలు చేసే అంశంపై విస్తృతంగా చర్చించింది. సమావేశం అనంతరం సమాచార, ప్రజాసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి సహచర మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి సచివాలయంలో విలేకరుల సమావేశంలో మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించారు. కొత్త చట్టంపై ఇతర రాష్ట్రాలూ న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నాయని తెలిపారు.  

టిమ్స్‌ ఆస్పత్రులకు 6,278 పోస్టులు 
కొత్తగా అందుబాటులోకి వస్తున్న టిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. సనత్‌నగర్, ఎల్‌బీ నగర్, అల్వాల్‌ టిమ్స్‌ ఆస్పత్రులతోపాటు వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో డాక్టర్లు, వైద్య సిబ్బంది పోస్టులు మంజూరు చేసింది. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వీలుగా మొత్తం 6,278 పోస్టుల మంజూరుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇందులో 1,494 రెగ్యులర్‌ పోస్టులు, 549 కాంట్రాక్ట్‌ బేసిక్‌ పోస్టులు, 4,235 ఔట్‌ సోర్సింగ్‌ పోస్టులకు అనుమతించారు. ఈ ఆసుపత్రులను నిమ్స్‌ తరహాలో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇక్కడ అందించే వైద్య సేవలకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి ఎల్‌ఓసీలు కూడా ఇవ్వాలని సీఎం ఆదేశించారు.  

రూ.7345 కోట్లతో మూసీ తొలి దశ 
మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌లో భాగంగా ఫేజ్‌–1 పనులకు మంత్రివర్గం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. తొలి దశలో 21 కి.మీ. పొడవునా అభివృద్ధి చేసేందుకు రూ.7,345.12 కోట్ల విలువైన పనుల మంజూరుకు ఆమోదం తెలిపింది. హిమాయత్‌ సాగర్‌ నుంచి ఈసా... ఉస్మాన్‌ సాగర్‌ నుంచి మూసా ప్రవాహాలు ప్రారంభమయ్యే చోటు నుంచి బాఫNఘాట్‌ వరకు ఈ పనులు చేపడతారు. మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ పనులు... నిర్వహణ కోసం నూతనంగా 147 పోస్టుల మంజూరుతోపాటు ఇతర శాఖల నుంచి అవసరమైన సిబ్బంది డిప్యూటేషన్‌కు ఆమోదం తెలిపారు. త్వరలో ఫేజ్‌–1 పనులకు టెండర్లు పిలవనున్నారు.  

ఉపాధ్యాయులకూ అల్పహారం, లంచ్‌ 
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో అందించే అల్పాహారం, పాలు, మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు, లెక్చరర్లు, సిబ్బందికి కూడా అందించాలని నిర్ణయించారు. పిల్లలకు నాణ్యమైన పోషకాహారం అందించే సంకల్పంతోపాటు జవాబుదారీతనం పెంచే ఆలోచనలో భాగంగా రాష్ట్రంలో దాదాపు లక్షన్నర మంది ఉపాధ్యాయులు, లెక్చరర్లు, సిబ్బందికి ఈ పథకం వర్తింపజేయనున్నారు.  

= వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలం బొల్లికుంట గ్రామంలో నిత్యావసర వస్తువుల గోదాముల నిర్మాణానికి 50 ఎకరాలను, రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ మండలం కర్కాలపహాడ్‌ గ్రామంలో 10 ఎకరాలను రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు మార్కెట్‌ ధర ప్రకారం కేటాయించేందుకు ఆమోదం. 
= జవహర్‌ నవోదయ విద్యాలయాలకు రెండు చోట్ల ప్రభుత్వం స్థలం కేటాయించింది. మహబూబ్‌నగర్‌ జిల్లా పెద్దాయిపల్లి గ్రామంలో 20.18 ఎకరాలు, సూర్యాపేట జిల్లా కోదాడలో 19.12 ఎకరాల ప్రభుత్వ భూమిని కేబినెట్‌ కేటాయించింది. జగిత్యాల జిల్లా చల్‌గల్‌ గ్రామంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన మరికొన్ని సంస్థలకు భూములు కేటాయించారు. 

ఆ చట్టం రాజ్యాంగ విరుద్ధం 
రాష్ట్రాలను సంప్రదించకుండా కేంద్రం తెచ్చిన వీబీ–జీ రామ్‌జీ చట్టంలోని నిబంధనలపై మంత్రివర్గం తీవ్రంగా నిరసన తెలిపింది. కూలీలకు ఉపాధి భరోసా కల్పించిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మార్పులు చేయొద్దని జనవరిలోనే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయంపై చర్చించింది. మరోసారి తమ నిరసనను కేంద్రానికి తెలియజేయాలని నిర్ణయించింది. వీబీ–జీ రామ్‌ జీ చట్టం అమలు విషయంలో ఇతర రాష్ట్రాలు ఏ నిర్ణయం తీసుకున్నాయో.. కొత్త చట్టంలో తెచ్చిన మార్పులతో రాష్ట్ర ప్రభుత్వానికి, కూలీలకు ఎలా నష్టం జరుగుతుంది తదితర అంశాలపై అధ్యయనం జరిపి మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం సమర్పించిన నివేదికపై మంత్రివర్గం క్షుణ్ణంగా పరిశీలన జరిపింది. సమాఖ్య స్ఫూర్తి విధానానికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం మోపేలా కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఉపసంఘం పేర్కొంది. ఇతర రాష్ట్రాలన్నీ కొత్త చట్టానికి ఆమోదం తెలిపాయా? లేదా? అని మంత్రివర్గం ప్రశ్నించగా, అన్ని రాష్ట్రాలూ కొత్త చట్టం అమలుకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement