సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీసులు పలు ఆంక్షలు విధిస్తూ కమిషనర్ వీసీ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 9న సాయంత్రం 6 నుంచి ఈనెల 11న సాయంత్రం 6 గంటల వరకు అలాగే ఈనెల 14న ఉదయం 6 గంటల నుంచి ఈనెల 15న ఉదయం 6 గంటల వరకు వైన్స్, రెస్టారెంట్లు, పబ్‌లు, క్లబ్‌లు స్టార్ హోటళ్లు వంటి దుకాణాలు బంద్ ఉంటాయి.
అలాగే కౌంటింగ్ రోజైన ఈనెల 14న ఉదయం 6 గంటల నుంచి తెల్లారి ఉదయం 6 గంటల వరకు పబ్లిక్ రోడ్లు, ప్రాంతాలలో టపాసులు కాల్చడాన్ని నిషేదిస్తూ ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ రోజు ప్రతీ పోలింగ్ బూత్ నుంచి, అలాగే కౌంటింగ్ రోజు ఈనెల 14న కోట్ల విజయ భాస్కర్ స్టేడియం నుంచి 200 మీటర్ల పరిధిలో ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది గుమిగూడకూడదని ఆదేశాలు జారీ చేశారు.


