
కుత్బుల్లాపూర్(హైదరాబాద్): గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేయడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. పోలీసులు స్థానికుల కథనం ప్రకారం.. బొల్లారం ప్రాంతానికి చెందిన సిద్దిక్ మేడ్చల్‌లో నివాసం ఉంటూ వారాంతపు మార్కెట్‌లో బ్యాటరీ లైట్లు సప్లై చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో కొంపల్లి మున్సిపల్ పరిధిలోని సెంట్రల్ పార్క్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మార్కెట్‌లో బ్యాటరీ లైట్లు సాయంత్రం ఇచ్చి.. తిరిగి రాత్రి తీసుకునే క్రమంలో ముగ్గురు వ్యక్తులు అతడిపై కత్తులతో దాడి చేయడంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు.
గతంలో సిద్దిక్ బొల్లారం ప్రాంతంలో బ్యాటరీ లైట్లు ఏర్పాటు విషయంలో మరో వర్గంతో గొడవ పడ్డాడని... అది మనసులో పెట్టుకొని కక్షగట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మాట్లాడుకుందాం.. అంటూ పిలిచి విచక్షణారహితంగా పొట్ట, ఛాతీ భాగాల్లో కత్తులతో పొడిచారు. ఇంతటితో ఆగకుండా నిందితుల్లో ఒకరు కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న సిద్దిక్ మెడను కోసేసినట్లు స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అక్కడి సీసీ కెమెరాలు పరిశీలించారు.
సిద్దిక్‌తో ఇటీవల జరిగిన గొడవలపై ఆరాతీశారు. ముగ్గురు నిందితులు వచి్చనట్లు స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకొని వారిని పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఏసీపీ రాములు పేర్కొన్నారు. ఘటనా స్థలాన్ని సీఐ విజయ్‌వర్ధన్, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ అజయ్ పరిశీలించారు. పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆ దిశగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.