
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్ (75) కన్నుమూశారు. హైదరాబాద్‌లో నిన్న (సోమవారం) రాత్రి ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. రచయితగా, ఇంద్రజాలికుడు, మానసిక వైద్యుడిగానూ ఆయన పేరు ప్రఖ్యాతలు పొందారు. ఖైరతాబాద్ నివాసంలో పట్టాభిరామ్ పార్థివదేహాన్ని ఉంచారు. రేపు (బుధవారం) ఉదయం నుంచి అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఆయన తెలుగుతో పాటు ఇంగ్లీషు, కన్నడ, తమిళ భాషల్లో కూడా రచనలు చేశారు. ఆయన విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణా తరగతులను నిర్వహింంచడంతో పాటు, తల్లిదండ్రుల అవగాహనా సదస్సులు కూడా నిర్వహించారు.
బీవీ పట్టాభిరామ్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పీహెచ్‌డీ పట్టా పొందిన తరువాత సైకాలజీ, ఫిలాసఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లలో స్నాతకోత్తర పట్టా అందుకున్నారు. ఇండియాలోనే కాకుండా.. అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా, థాయ్‌లాండ్, సింగపూర్, అరబ్ దేశాలలో అనేక వర్క్ షాపులు నిర్వహించారు.