‘గృహలక్ష్మి’పై లబ్దిదారుల్లో డైలమా! | People will not come forward to construct houses | Sakshi
Sakshi News home page

‘గృహలక్ష్మి’పై లబ్దిదారుల్లో డైలమా!

Oct 29 2023 5:08 AM | Updated on Oct 29 2023 5:08 AM

People will not come forward to construct houses - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గృహలక్ష్మి ఇళ్లు మంజూరైనప్పటికీ నిర్మించుకునేందుకు జనం ముందుకు రావటం లేదు. బేస్‌మెంట్‌ స్థాయి వరకు నిర్మాణం జరుపుకోగానే, తొలి విడత రూ.లక్ష లబ్దిదారులకు అందజేయాల్సి ఉంది. ప్రస్తుతం 2.15 లక్షల మందికి మంజూరు పత్రాలు జారీ చేసి లబ్దిదారుల జాబితాలో చేర్చారు. వీరు ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించుకోవాల్సి ఉంది.

కానీ, ఎక్కడా వాటి జాడే లేకుండా పోయింది. లబ్దిదారుగా మంజూరు పత్రం రాగానే తొలి విడత రూ.లక్ష విడుదల చేస్తే బాగుంటుందని బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు తొలుత ఒత్తిడి చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఒకరిద్దరు మంత్రులు కూడా ఆ మేరకు ప్రకటన కూడా చేశారు. కానీ, బేస్‌మెంట్‌ స్థాయి వరకు పనులు జరిపితేనే తొలి విడత ఇవ్వటం మంచిదని ఉన్నతాధికారులు స్పష్టం చేయటంతో ఆమేరకే నిర్ణయించినట్టు తెలిసింది.

ఆ ప్రకారం బేస్‌మెంట్‌ స్థాయి వరకు పనులు చేపడితే, 2.15 లక్షల మందికి నిధులు విడుదల కావాల్సి ఉంది. కానీ, పనులు ప్రారంభించుకున్న దాఖలాలు మాత్రం కనిపించకపోవటం ఇప్పుడు ఆసక్తిగా మారింది.  

మొదటినుంచీ ఆలస్యమే... 
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పథకం వేగంగా ముందుకు సాగకపోవటం, ప్రజల్లో విమర్శలు వెల్లువెత్తటంతో నష్టనివారణ చర్యగా ప్రభుత్వం గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది. సొంత జాగా ఉన్న వారికి రూ.3 లక్షలు చొప్పున విడతల వారీగా అందించి, ఇళ్ల నిర్మాణ బాధ్యతను వారికే అప్పగించింది. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుని, బడ్జెట్‌లో నిధులు ప్రతిపాదించింది. కానీ, దరఖాస్తుల ప్రక్రియలో తీవ్ర జాప్యం జరిగింది.

రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల దరఖాస్తులు రాగా, దాదాపు 11 లక్షల దరఖాస్తులను అర్హమైనవిగా అధికారులు తేల్చారు. వీటిల్లోంచి 4 లక్షల మంది లబ్దిదారులతో జాబితా రూపొందించే పనిలో మరింత ఆలస్యం జరిగింది. 2.15 లక్షల మందికి మంజూరు పత్రాలు జారీచేసే సమయానికి ఎన్నికల షెడ్యూల్‌ విడుదలై కోడ్‌ అమలులోకి వచ్చింది. దీంతో అక్కడితో ఆ ప్రక్రియ ఆపేశారు. కానీ, అర్హులు కూడా పనులు ప్రారంభించుకునేందుకు ఆసక్తి చూపకపోవటం ఇప్పుడు ఆసక్తిగా మారింది.  

కాంగ్రెస్‌ పార్టీ హామీతో... 
ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన ‘ఆరు గ్యారంటీ’ల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం ఉంది. అధికారంలోకి వస్తే ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ పథకం కింద రూ.5 లక్షలు అందిస్తామని ఆ పార్టీ హామీ ఇచ్చింది. గృహలక్ష్మి పథకం కంటే ఆ నిధులు ఎక్కువ. ఇప్పుడు ఇళ్ల నిర్మాణం ప్రారంభించుకున్నాక, కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ పథకం కింద ఇళ్లు మంజూరు కావన్న భావన ఎక్కువ మందిలో ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే, గృహలక్ష్మి లబ్దిదారులు ఇళ్ల నిర్మాణం ప్రారంభించటం లేదని చెబుతున్నారు.

ఎన్నికలు పూర్తిగా దగ్గరపడ్డ నేపథ్యంలో, ఇప్పుడు పనులు ప్రారంభించుకున్నా నిధులు విడుదల కావన్న భావన కూడా వారిలో ఉందన్నది మరికొందరి వాదన. ముందు లక్ష తమ ఖాతాలో జమ అయితేనే పనులు ప్రారంభించుకోవాలని లబ్దిదారులు భావిస్తున్నారన్నది మరో మాట. ఇలా కారణాలు ఏవైనా, లబ్దిదారులుగా నమోదైన వారు పనులు ప్రారంభించుకోకపోవటం చర్చనీయాంశంగా మారింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement