‘పంచాయతీ’ సన్నాహాలు
నేడు జీఓ జారీ.. వెంటనే జిల్లాల్లో రిజర్వేషన్ల ఖరారు
జిల్లా కలెక్టర్లు, జెడ్పీ సీఈఓలకు చేరిన బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్
ముసాయిదా నివేదికపై కసరత్తు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 26 లేదా 27న గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్నట్టుగా అధికారవర్గాల ద్వారా తెలుస్తోంది. షెడ్యూల్ విడుదలైన వెంటనే రాష్ట్రంలోని 31 జిల్లాల్లో (హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లాలు మినహా) ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రానుంది. ఈ నెల 25న జరగనున్న కేబినెట్ భేటీలో పంచాయతీ ఎన్నికలపై నిర్ణయం తీసుకొని, రిజర్వేషన్ల ఖరారు, ఎన్నికల తేదీలను నిర్ణయించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ)కు తెలియజేస్తారు.
మూడు విడతల్లో ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీ సూత్రప్రాయంగా నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీలను మూడు విడతల ఎన్నికలకు విభజించి, ఎన్నెన్ని సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికలు జరపాలో నిర్ణయిస్తారు. దీనికి సంబంధించిన కసరత్తు పూర్తి చేసేందుకు ఎస్‌ఈసీకి ఒకరోజు సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.
27న షెడ్యూల్ విడుదలయ్యే పక్షంలో...డిసెంబర్ 10 లేదా 11 తేదీల్లో తొలి విడత ఎన్నికలు, మూడు రోజుల అంతరంతో 13 లేదా 14 తేదీల్లో రెండో విడత, మళ్లీ మూడు రోజుల గ్యాప్‌తో 16 లేదా 17 తేదీలో మూడోదశ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ఒక్కో దశకు ఆయా తేదీలను బట్టి ఎక్కడికక్కడ రిటరి్నంగ్ అధికారులు ఆయా స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్లు విడుదల చేస్తారు. ఈ ఎన్నికల నోటీసు జారీచేసిన రోజు కలుపుకొని మూడురోజులు అభ్యర్థుల నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంటుంది. ఏ విడతకు ఆ విడత పోలింగ్ పూర్తికాగానే సర్పంచ్, వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపు ప్రారంభించి, అదే రోజు సాయంత్రమే ఎన్నికైన వారిని ప్రకటిస్తారు. ఏదైనా కారణంచేత ఉపసర్పంచ్ ఎన్నిక జరగకపోతే మరుసటిరోజు గ్రామ పంచాయతీ నిర్ణయించిన మేరకు సెలవుదినం అయినా కూడా ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది.
నేడు జీఓ జారీ!
బీసీ డెడికేటెడ్ కమిషన్ సమరి్పంచిన నివేదికలోని సిఫార్సులను సర్క్యులేషన్ మోడ్‌లో మంత్రుల సంతకాలు తీసుకొని రాష్ట్ర కేబినెట్ ఆమోదించినట్టు సమాచారం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా ఎస్టీ, ఎస్టీ, బీసీ రిజర్వేజన్ల ఖరారుకు సంబంధించిన జీఓ శనివారం జారీకానుంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్నిరకాలుగా సిద్ధంగా ఉన్నామని, 50 శాతంలోపు రిజర్వేషన్ల ఖరారు జీఓ, జిల్లాల వారీగా రిజర్వేషన్లపై కసరత్తు, ఎన్నికల ఏర్పాట్లు చేసుకున్నట్టుగా 24న హైకోర్టుకు పంచాయతీరాజ్‌శాఖ తెలియజేయనుంది.
గతంలో బీసీలకు 42 శాతం, ఎస్టీలకు ఎస్సీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను ఖరారు చేశాక జీఓ విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా స్థానిక సంస్థల్లో 50శాతం లోపు రిజర్వేషన్ల అమలుపై మరోసారి సవరించిన జీఓను జారీచేయాల్సి ఉంది. దీనికి అనుగుణంగా పంచాయతీరాజ్‌శాఖ ద్వారా ఇచ్చే ఆదేశాల ప్రకారం జిల్లాల్లో 50 శాతంలోపు రిజర్వేషన్లను ఎస్టీ, ఎస్సీ, బీసీలకు కేటాయించనున్నారు. ఆ తర్వాత ఏ జిల్లాకు ఆ జిల్లా కలెక్టర్లు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ గెజిట్ జారీ చేస్తారు. వీటన్నింటిని కలిపి పీఆర్‌ఆర్‌డీ శాఖ ఎస్‌ఈసీకి అందజేస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలో ఆ తేదీలను నిర్ణయించి ఎస్‌ఈసీకి చెబుతుంది. గ్రామ పంచాయతీల్లో 50 శాతం మించకుండా కొత్త రిజర్వేషన్లకు సిఫార్సు చేసిన నివేదిక ఆధారంగా...జీపీలు, వార్డుల వారీగా రిజర్వేషన్ల విధివిధానాలను ఖరారు చేస్తూ పంచాయతీరాజ్‌శాఖ శనివారం జీవో జారీచేయనుంది. రాజకీయ పారీ్టల నేతల సమక్షంలో లాటరీ పద్ధతిలో అన్ని కేటగిరీల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ల కేటాయింపు జరగనుంది. శని,ఆది వారాల్లో జిల్లాల్లోని ఆర్డీఓలు, సీఈఓలు, డీపీఓలు రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేస్తారు.
ఆ తర్వాత అన్ని జిల్లాల కలెక్టర్లు రిజర్వేషన్ల ఖరారు గెజిట్ విడుదల చేశాక ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్టుగా ఎస్‌ఈసీకి పీఆర్ శాఖ ద్వారా ప్రభుత్వం తెలియజేయనుంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని...దీనిపై దాఖలైన విచారణను ముగించాలని ఈ నెల 24న హైకోర్టుకు ఎస్‌ఈసీ, ప్రభుత్వం తరఫున పీఆర్‌శాఖ వేర్వేరుగా తెలియజేయనున్నాయి. తమ ప్రతిపాదనలపై హైకోర్టు స్పందన, సూచనలను బట్టి ఎన్నికల షెడ్యూల్ విడుదలకు అవకాశం ఉన్నట్టుగా ఎస్‌ఈసీ వర్గాలు చెబుతున్నాయి.
రిజర్వేషన్ల ఖరారుపై కసరత్తు వేగం
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ, వార్డుల స్థాయిలో రిజర్వేషన్ల ఖరారుపై కసరత్తు వేగం పుంజుకుంది. శనివారంలోగా జిల్లాస్థాయిల్లో రిజర్వేషన్లపై ప్రాథమిక కసరత్తు పూర్తికానుంది. ఆదివారం కల్లా్ల పీఆర్‌ఆర్‌డీకి జిల్లాల నుంచి నివేదికలు అందనున్నాయి. శుక్రవారం అన్ని జిల్లాల్లోని ఎంపీడీఓలకు బీసీ డెడికేషన్ కమిషన్ నివేదిక కాపీలను జెడ్పీ సీఈఓలు పంపించారు. నివేదికలో పేర్కొన్న జనాభా వివరాలు, సమాచారానికి అనుగుణంగా మొదట ఎస్టీ, ఎస్సీ, ఆ తర్వాత బీసీల రిజర్వేషన్లను లెక్కించే పనుల్లో ఎంపీడీఓలు నిమగ్నమయ్యారు. తమ మండలాల్లోని గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా రిజర్వేషన్ల ఖరారుపై దృష్టి కేంద్రీకరించారు. శనివారం కల్లా ప్రాథమికంగా రిజర్వేషన్లను తేల్చాక, ప్రభుత్వపరంగా విడుదలయ్యే జీఓలోని అంశాలు, మార్గదర్శకాలతో సరిపోల్చనున్నారు.
పంచాయతీ ఎన్నికలు జరిగే స్థానాలివే...
మొత్తం గ్రామ పంచాయతీలు : 12,733
మొత్తం వార్డులు : 1,12,288
పోలింగ్ స్టేషన్లు : 1,12,474
గ్రామపంచాయతీ పోలింగ్ ప్రాంతాలు : 15,522
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత ఓటర్లు
పురుషులు : 81,65,894
మహిళలు : 85,36,770
ఇతరులు : 504


