
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ నివేదికపై అధికారుల అధ్యయనం ముగిసింది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యమైన అందరి గురించి నివేదికలో కమిషన్ పేర్కొంది. పూర్తిస్థాయి నివేదికలో కీలక అంశాలను కమిటీ ప్రస్తావించింది. బాధ్యులందరిపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలని కమిషన్ సూచించింది.
ఆర్థిక శాఖ అధికారుల లోపాలపైనా కమిషన్ ఫోకస్ పెట్టింది. ఇరిగేషన్ శాఖ పంపిన అంచనాలను గుడ్డిగా ఆమోదం తెలిపారని నివేదికలో తెలిపింది. ఆర్థిక శాఖ చేయాల్సిన కనీస బాధ్యతలు నిర్వహించలేదన్న కమిషన్.. ప్రాజెక్టు నిర్మాణంలో టెక్నాలజీ వ్యవహారంలో లోటుపాట్లను కమిషన్ ప్రస్తావించింది. లోకేషన్ల విషయంలో కేసీఆర్ చొరవే ఎక్కువని కమిషన్ పేర్కొంది.
రేపు(సోమవారం) కేబినెట్‌లో రిపోర్ట్‌పై పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. కేబినెట్ చర్చ తర్వాత అసెంబ్లీ సమావేశంలో ఈ నివేదికపై సుదీర్ఘంగా చర్చించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అన్ని పార్టీల ఆలోచన తెలుసుకునే పనిలో ప్రభుత్వం ఉంది.
కాగా, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల వైఫల్యానికి మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యుడని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ తన నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. అలాగే మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌తో పాటు నీటిపారుదల శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషీ, నాటి సీఎం కేసీఆర్ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్, కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ ఈఎన్సీ హరిరామ్‌ల పాత్ర కూడా ఉన్నట్టుగా వెల్లడించినట్లు సమాచారం.
బరాజ్‌ల ప్లానింగ్, నిర్మాణం, పనుల పూర్తి, నిర్వహణ, పర్యవేక్షణకు సంబంధించి జరిగిన అవకతవకల్లో కేసీఆర్ పాత్ర ఉందని వెల్లడించినట్లు సమాచారం. నాడు సీఎం హోదాలో నిర్వహించిన సమీక్ష సమావేశాల్లో బరాజ్‌ల అంచనాల పెంపు (ప్రైస్ అడ్జస్ట్‌మెంట్), కాంట్రాక్టర్లతో ఒప్పందాల సవరణ, వారికి ఫైనాన్షియల్ గ్యారంటీల విడుదల విషయంలో అధికారులపై కేసీఆర్ ఒత్తిడి తెచ్చారని నిర్ధారించినట్లు తెలిసింది.
మేడిగడ్డ బరాజ్ 2023 అక్టోబర్ 21న కుంగిపోగా, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో సైతం బుంగలు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పాటైన తర్వాత బరాజ్‌ల నిర్మాణంలో సాంకేతిక లోపాలతో పాటు అవినీతి ఆరోపణలపై విచారణ కోసం 2024 మార్చి 14న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను నియమించింది. కాగా కమిషన్ 115 మంది సాక్షులను విచారించింది. జూలై 31న సర్కారుకు నివేదిక సమర్పించింది.