నాలుగు నెలల క్రితం ఆమె వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కోటి ఆశలతో మెట్టింట్లో అడుగు పెట్టింది. ఆనందంగా సాగిపోతున్న వైవాహిక జీవితాన్ని చూసి విధికి కన్నుకుట్టినట్లు ఉంది. విద్యుత్ రూపంలో మరణ శాసనం లిఖించింది.
నిర్మల్ : బోరిగాం గ్రామానికి చెందిన నల్ల రేఖ(23)కు నాలుగు నెలల క్రితం మహారాష్ట్రలోని అప్పారావుపేట్‌కు చెందిన యువకుడితో వివాహం జరిగింది. భర్త సోదరి వివాహం గురువారం లోకేశ్వరం మండలం పిప్రి గ్రామంలో జరిగింది. ఈ వివాహానికి రేఖ, ఆమె కుటుంబ సభ్యులు హాజరయ్యారు. రాత్రి వధువును అత్తారింటికి సాగనంపి బోరిగాం గ్రామానికి తిరిగి వచ్చారు.
బట్టలు ఆరేస్తుండగా
శుక్రవారం ఉదయం ఇంటి దాబాపై బట్టలు ఆరేస్తుండగా చీర అనుకోకుండా సమీపంలో ఉన్న విద్యుత్ తీగలకు తగిలింది. షాక్‌కు గురైన రేఖ పెద్దగా అరిచి పడిపోయింది. కుటుంబ సభ్యులు పరుగెత్తుకొచ్చి రక్షించే ప్రయత్నం చేశారు. అప్పటికే ఆమె ప్రాణాలు వదిలింది. నాలుగు నెలల క్రితం కూతురి పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించిన తల్లి దండ్రులు ఆమె మృతదేహం వద్ద గుండెలు పగిలేలా రోదించారు. భార్యను విగతజీవిగా చూసిన భర్త రోదించిన తీరు కంటతడి పెట్టించింది.
ఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ..
సమాచారం అందుకున్న నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, రూరల్ సీఐ కృష్ణ, ఎస్సై శ్రీకాంత్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. విద్యుత్ తీగలకు వేసిన రక్షణ పైపులు పగిలిపోవడం వల్లే చీర నేరుగా తీగలకు తగిలి ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.


