పురుగుల మందు తాగి తనువు చాలించిన గర్భిణి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పెళ్లయి ఆరు నెలలు నిండకముందే వరకట్న వేధింపులకు ఓ అబల బలైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం లచ్చగూడెంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కమటం వెంకటేశ్వర్లు కుమార్తె అంజలి (19)ని అదే గ్రామానికి చెందిన చిట్టూరి ఉపేందర్–ఉమ దంపతుల కుమారుడు సాయికుమార్‌కు ఇచ్చి ఈ ఏడాది మే 14న వివాహం జరిపించారు. రెండెకరాల పొలం, ఐదు తులాల బంగారం, రూ.10 లక్షల నగదు వరకట్నంగా అందజేశారు. హైదరాబాద్‌లో ఇంటీరియల్ డెకరేషన్ పని చేస్తున్న సాయికుమార్ భార్యను స్వగ్రామంలోనే ఉంచి తరచూ వచ్చి వెళ్లేవాడు.
ప్రస్తుతం ఆమె మూడు నెలల గర్భిణి. ఈ క్రమంలో మరికొంత కట్నం తేవాలని భర్తతోపాటు అత్తమామలు, ఆడపడుచు నిరంజని, ఆమె భర్త మోహన్‌ప్రసాద్ వేధించసాగారు. దీంతో వెంకటేశ్వర్లు కుల పెద్దల వద్ద మాట్లాడగా.. ఇకపై మంచిగా చూసుకుంటానని సాయికుమార్ చెప్పినా ఆ రోజు నుంచి అంజలికి వేధింపులు మరింత పెరిగాయి. ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టి ఆమెను గృహ నిర్బంధం చేశారు. గ్రామంలో ఎవరితో మాట్లాడకుండా కట్టుదిట్టం చేయగా అంజలి మానసిక క్షోభకు గురైంది.
సాయికుమార్ ఆదివారం మరోసారి ఘర్షణ పడడంతో మనస్తాపానికి గురైన అంజలి ఇంట్లోనే పురుగులమందు తాగింది. వెంటనే సాయికుమార్ ఇల్లెందు ఆస్పత్రికి, అక్కడి నుంచి ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాడు. కానీ సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు అంజలి మృతి చెందినట్లు వైద్యులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఆ వెంటనే సాయికుమార్, అతడి కుటుంబసభ్యులు ఇల్లెందుకు చేరుకుని పోలీసులకు సరెండర్ అయ్యారు. అంజలి తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు అత్తింటివారిపై వరకట్నం కేసు నమోదు చేసినట్లు సీఐ సురేశ్ తెలిపారు.


