ఇచ్చాపురంలో వెలుగు చూసిన ఘటన
ఇచ్చాపురం రూరల్: పెళ్లి పేరిట అమాయకులను మోసం చేస్తున్న ఓ యువతి వ్యవహారం బయటప డింది. ఇప్పటికే రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకు న్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె ఈ నిజాలను దాచి మరోసారి వివాహం చేసుకుని వరుడి కుటుంబాన్ని బురిడీ కొట్టించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం భవానీపురంలో నివాసం ఉంటున్న యువతి వాణిని వివాహం చేసుకోవడానికి కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లాకు చెందిన నాగిరెడ్డి సురేష్‌రెడ్డి మధ్యవర్తుల ద్వారా లక్ష రూపాయల ఎదురు కట్నం ఇచ్చాడు.
ఈనెల 17న సోంపేట కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఇరు కుటుంబాల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. 19వ తేదీన తన స్వగ్రామం కోలార్ వెళ్లేందుకు సురేష్‌రెడ్డి భార్య వాణితో కలిసి పలాసలో ట్రైన్ ఎక్కారు. విజయనగరం రైల్వేస్టేషన్‌కు వచ్చే సరికి భర్త కళ్లు గప్పి ఆమె నేరుగా ఇచ్చాపురంలోని తన ఇంటికి చేరుకుంది. భార్య కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన భర్త సురేష్ రెడ్డి అంతటా వెతికి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తిరిగి ఇచ్చాపురం (Ichchapuram) వచ్చి చూడగా వాణి ఇంట్లోనే ఉంది. ఎందుకిలా చేశావంటూ ప్రశ్నించగా తనకు పెళ్లి ఇష్టం లేదని చెప్పింది. దీంతో మోసపోయినట్లు గ్రహించిన సురేష్‌రెడ్డి తన వారితో కలిసి గురువారం రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు.
ఎదురు కట్నం ఇచ్చినా..
ఇంతకు ముందే ఆమెకు పలువురితో వివాహాలు జరిగినట్లు ఫొటోలు తమకు కనిపించాయని, ఎదురు కట్నంతో పాటు వెండి పట్టీలు, మెట్టెలు, బట్టలు ఇచ్చామంటూ వరుడు సురేష్‌రెడ్డి, వారి బంధువులు విలేకరుల ఎదుట వాపోయారు. అయితే పెళ్లి కుమార్తెకు తాము ఇచ్చిన కట్నం, వెండి వస్తువులు తిరిగి ఇచ్చేస్తే కేసు పెట్టమని వారు డిమాండ్ చేశారు. ఆమెకు ఇప్పటికే ఇద్దరితో నిశ్చితార్థం జరిగిందని, ఇప్పుడు తమ అబ్బాయితో పెళ్లి జరిగిందని తెలిపారు. అయితే వరుడు ఇచ్చిన వస్తువులు ఇచ్చేందుకు యువతి తరఫు వారు సమ్మతించడంతో కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.



