శ్రీకాకుళం జిల్లా: గ్రూప్–1 ఫలితాల్లో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని ఎస్‌ఎం పురం గ్రామానికి చెందిన సంపతిరావు శివనాగగౌరి సత్తాచాటారు. డీఎస్పీగా ఎంపికయ్యారు. మొత్తం 25 మంది డీఎస్పీలుగా ఎంపిక కాగా శ్రీకాకుళం జిల్లా నుంచి శివనాగగౌరి ఎంపిక కావడం విశేషం. ప్రాథమిక విద్య, పదో తరగతి వరకూ శ్రీకాకుళం నగరంలోని మునసబుపేట వద్ద గల గాయత్రి స్కూల్‌లోనూ, ఇంటర్ విశాఖపట్నంలోని శ్రీచైతన్య విద్యాసంస్థలో చదువుకున్నారు. అనంతరం తమిళనాడులోని వీఐటీలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు. ఈమె 2017లో పోలవరం ప్రాజెక్ట్‌లో ఏఈఈగా ఎంపికయ్యారు.
డిప్యుటేషన్‌పై ప్రస్తుతం వంశధార ప్రాజెక్టులో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ)గా విధులు నిర్వహిస్తున్నారు. 2017లోనే ఈమె గెయిల్‌లో (గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్) ఇంజినీర్‌గా ఎంపికయ్యారు. ఈమె అత్తమ్మ చౌదరి ధనలక్ష్మీ గతంలో జెడ్పీ చైర్‌పర్సన్ పనిచేశారు. ఈమె భర్త చౌదరి అవినాష్ ప్రస్తుతం డీసీఎంఎస్ చైర్మన్. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈమె గతంలో గ్రూపు–1 పరీక్షల్లో ఇంటర్వ్యూ వరకూ వెళ్లి విఫలమయ్యారు. అయితే పట్టు వదలకుండా రెండో సారి ప్రయత్నించి విజయం సాధించారు.


