సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో నేపాల్ గ్యాంగ్ దోపిడీకి పాల్పడింది. గచ్చిబౌలి హిల్ రిడ్జ్ విల్లాలో నివాసం ఉంటున్న వ్యాపారి ఇంట్లో సుమారు కేజీ బంగారం, వజ్రాలను ఎత్తుకెళ్లారు. ఆ ఇంట్లో పనిచేసే నేపాల్ దంపతులే చోరీ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. నెల రోజుల క్రితమే వ్యాపారి ఆ దంపతులను పనిలో పెట్టుకోగా, ఇటీవల వ్యాపారి కుటుంబం ముంబై వెళ్లి తిరిగి వచ్చేసరికి చోరీ జరిగింది.
ఇంట్లో తాళాలు పగలగొట్టినట్లు ఎలాంటి గుర్తులు లేకపోవడంతో మొదట వారు చెప్పకుండా వెళ్లిపోయారని భావించారు. పూజ గదిలోని విగ్రహానికి ఉన్న బంగారు గొలుసు, తదుపరి జరిపిన తనిఖీల్లో మరికొన్ని ఆభరణాలు మాయమైనట్లు గుర్తించిన వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందాలు.. నిందితుల కోసం గాలిస్తున్నాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.
కాగా, గత నెల 8వ తేదీన ప్రశాసన్‌నగర్‌లోని విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్‌రంజన్ భార్య తనూజరంజన్‌ను దారుణంగా హత్య చేసి బంగారు నగలతో ఉడాయించిన నేపాలీ గ్యాంగ్‌లో ఒక నిందితుడిని, నగలు కొనుగోలు చేసిన రిసీవర్‌ను ఇటీవల జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితురాలు కల్పన అలియాస్ ధర్మతో పాటు మరో ఐదుగురు పోలీసుల కళ్లుగప్పి నేపాల్‌లోకి అడుగుపెట్టారు.
చోరీకి గురైన సొత్తులో కొంత మాత్రమే రికవరీ అయ్యింది. మిగతా సొమ్ముతో పాటు ప్రధాన సూత్రధారులైన నేపాలీ గ్యాంగ్ ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు ఈ ఘటనకు పాల్పడ్డ నేపాలీ గ్యాంగ్ సునీల్ పెరియార్‌తో పాటు రిసీవర్ దిలీప్‌లను పది రోజుల కస్టడీకి తీసుకున్నారు. వీరిని మరింత లోతుగా విచారించనున్నారు. ఆ రోజు జరిగిన ఘటనతో పాటు హత్య చేసిన అనంతరం ఎక్కడెక్కడికి వెళ్లారు.. తదితర వివరాలు సేకరించనున్నారు. ఇప్పటికే పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. ఇంతలోనే నగరంలోని . గచ్చిబౌలి హిల్ రిడ్జ్ విల్లాలో మరో నేపాలీ గ్యాంగ్ దోపిడీకి పాల్పడటం కలకలం రేపుతోంది.


