భార్య ‘ఖులా’ విడాకులు కోరవచ్చు | Muslim women can unilaterally divorce: Telangana HC | Sakshi
Sakshi News home page

భార్య ‘ఖులా’ విడాకులు కోరవచ్చు

Jun 26 2025 8:25 AM | Updated on Jun 26 2025 8:25 AM

Muslim women can unilaterally divorce: Telangana HC

సాక్షి, హైదరాబాద్‌: ఖులా విడాకులు కోరే సంపూర్ణ హక్కు ముస్లిం భార్యకు ఉంటుందని, భర్త డిమాండ్‌ను అంగీకరించాల్సిన అవసరం లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. వివాహ రద్దుపై న్యాయస్థానం ముద్ర మాత్రమే వేస్తుందని, దానికి కట్టుబడటం ఇరుపక్షాలపై ఉంటుందని స్పష్టం చేసింది. తన భార్యతో వివాహాన్ని రద్దు చేయడంలో సదా ఈ హక్‌ షరాయ్‌ కౌన్సిల్‌ నిర్ణయాన్ని సమర్థించిన కుటుంబ కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ చాంద్రాయణగుట్టకు చెందిన ఓ వ్యక్తి హైకోర్టులో అప్పీల్‌ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై జస్టిస్‌ మౌషుమి భట్టాచార్య, జస్టిస్‌ బీఆర్‌ మధుసూదన్‌రావు ధర్మాసనం సమగ్ర తీర్పును వెలువరించింది.

 భార్య వివాహ బంధాన్ని కొనసాగించకూడదనుకుని ముఫ్తీని సంప్రదించి ప్రైవేట్‌గా పరిష్కరించుకునే విధానమే ‘ఖులా’. షరియత్‌ ఆధారంగా ముఫ్తీ సలహా (ఫత్వా) ఇస్తారు. ఒకవేళ ప్రైవేట్‌గా పరి ష్కారం కాకపోతే.. వ్యాజ్యం దాఖలైతే న్యాయమూర్తి షరియత్‌ ఆధా రంగా తీర్పు ఇవ్వవలసి ఉంటుంది. ఈ కేసులో భర్త వేధింపులు భరించలేక భార్య ఖులా కోరారు. భర్త అంగీకరించకపోవడంతో సదా ఈ హక్‌ షరాయ్‌ కౌన్సిల్‌ ద్వారా ఖులానామా (విడాకుల పత్రం) పొందారు. 

దీనిని భర్త ఫ్యామిలీ కోర్టులో సవాల్‌ చేసినా ఊరట దక్కలేదు. దీంతో హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఖులా ద్వారా విడాకులు పొందవచ్చన్న ఫ్యామిలీ కోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. మెహర్‌ (కట్నం) మొత్తాన్ని, అందులో కొంత భాగాన్ని తిరిగి ఇవ్వడంపై చర్చలు జరపడం తప్ప ఆమె డిమాండ్‌ను తిరస్కరించే హక్కు భర్తకు లేదని కోర్టు అభిప్రాయపడింది.

Advertisement
 
Advertisement
Advertisement