ఊహించని సాక్ష్యాలతో రేపు ప్రెస్‌మీట్‌ పెడతా: పాడి కౌశిక్‌రెడ్డి | Mla Padi Kaushik Reddy Granted Bail | Sakshi
Sakshi News home page

ఊహించని సాక్ష్యాలతో రేపు ప్రెస్‌మీట్‌ పెడతా: పాడి కౌశిక్‌రెడ్డి

Jun 21 2025 8:38 PM | Updated on Jun 22 2025 9:58 AM

Mla Padi Kaushik Reddy Granted Bail

సాక్షి, వరంగల్‌: క్వారీ యజమానిని బెదిరించిన కేసులో హుజూరాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి ఊరట లభించింది. కాజీపేట రైల్వే కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. ఆపై శనివారం రాత్రి బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. 

‘‘ మా లీగల్ టీమ్ కు పేరు పేరునా కృతజ్ఞతలు. నన్ను జైలుకు పంపడం కోసం నిన్నరాత్రి నుండి సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న డ్రామాను ప్రజలు గమనిస్తున్నారు. నన్ను జైలుకు పంపాలని ఎన్ని కుట్రలు చేసినా భయపడను. నేను Ak 47ను అవుతా. తెలంగాణలో మంత్రులు ఇసుక దందా, పేదల భూములు కబ్జా చేస్తున్నారు. రేపు అందరి అక్రమాలు ఆధారాలతో సహా బయట పెడతా. ఊహించిన సాక్ష్యాలతో రేపు తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం పెడతా అని కౌశిక్‌రెడ్డి అన్నారు. 

క్వారీ యజమానిని బెదిరించిన కేసులో పోలీసులు ఆయన్ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నాటకీయ పరిణామాల నడుమ శనివారం ఉదయం కౌశిక్‌రెడ్డిని శంషాబాద్ విమానాశ్రయంలో వరంగల్ సుబేదారీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  అనంతరం వరంగల్‌కు తరలించి.. తొలుత ఎంజీఎం ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఆపై కాజీపేట రైల్వే కోర్టులో హాజరుపర్చారు. తొలుత కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్‌ విధించడంతో.. ఖమ్మం జైలుకు తరలించేందకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈలోపు  41ఏ నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేశారని కౌశిక్‌రెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపించడంతో.. రిమాండ్‌ రద్దు చేస్తూ షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది కోర్టు.

కేసు ఏంటంటే.. 
మనోజ్ రెడ్డి అనే వ్యక్తి కమలాపూర్ మండలంలోని వంగపల్లిలో గ్రానైట్ క్వారీ నిర్వహిస్తున్నారు. హుజూరాబాద్ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తనను రూ.50 లక్షలు ఇవ్వాలని బెదిరించినట్లు మనోజ్ రెడ్డి భార్య ఉమాదేవీ సుబేదారీ పీఎస్‌లో చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌)లోని సెక్షన్‌ 308(2), 308(4), 352 కింద కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే సుబేదారీ పోలీసులు శనివారం తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కౌశిక్‌ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement