మూసీలోకి నీళ్లు ఎప్పుడు రావాలి? వచ్చే ఎన్నికల నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందా?
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు అమలుపై మంత్రుల అనుమానాలు
మనమంతా ఏకతాటిగా వెళ్లాల్సిన సమయంలో సందేహాలా అంటూ అని సీఎం ఒకింత అసహనం
మూసీ ప్రాజెక్టు మొదటి దశను ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తామన్న రేవంత్‌రెడ్డి
ఈ ప్రాజెక్టును ముందు పెట్టి ఎన్నికలకు ప్రజల ముందుకు వెళ్దామని స్పష్టీకరణ
మూసీపై కేబినెట్‌లో వాడీవేడి చర్చ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో వాడీవేడి చర్చ జరిగినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు వచ్చే సాధారణ ఎన్నికల నాటికి పూర్తయ్యే అవకాశం ఉందా అని సీనియర్ మంత్రులు ఒకరిద్దరు ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారులు ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా సీనియర్ మంత్రులు సందేహాలు వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. మూసీలోకి నీళ్లు ఎప్పుడు రావాలి?గాంధీ సరోవర్ ప్రాజెక్టు పూర్తవడానికి ఎంత సమయం పడుతుందన్న అనుమానాలు వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంకు నుంచి రూ. 7వేల కోట్ల రుణం తీసుకుని మొదటి దశలో 21 కి.మీ. మేరకు పునరుజ్జీవం చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. మూసీ పునరుజ్జీవానికి పెట్టే పెట్టుబడికి ఆ మేరకు తిరిగి ఆదాయం వచ్చే అవకాశం ఉందా అని మంత్రులు అనుమానాన్ని వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ప్రభుత్వం ముందు నుంచి దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని మనమంతా ఏకతాటిగా ముందుకు వెళ్లాల్సిన సమయంలో సందేహాలు వ్యక్తం చేస్తే ఎలా అని రేవంత్ కాస్త అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
వచ్చే సాధారణ ఎన్నికల నాటికి మొదటి దశ పనులను ఎట్టిపరిస్థితుల్లోనూ పూర్తి చేయాల్సిందేనని సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం.మూసీ పునరుజ్జీవం నగరానికి కొత్త శోభను తెస్తుందని, ఎలాంటి సందేహాలు అవసరం లేదని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఈ ప్రాజెక్టును ముందు పెట్టి ఎన్నికలకు ప్రజల ముందుకు వెళ్దామని చెప్పారని అంటున్నారు. మంత్రివర్గ సమావేశంలో వీబీ–జీ రామ్‌జీ కంటే కూడా మూసీపైనే మంత్రుల మధ్య ఎక్కువ సేపు చర్చ జరిగిందని సమాచారం.
వాళ్ల ఆఫీసుకు వస్తామని ఎందుకు చెప్పారు?
మంత్రుల స్థాయిలో రాజకీయ వ్యూహాలు అమలు చేయడం పకడ్బందీగా సమన్వయంతో వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ వ్యూహాల అమల్లో ప్రతిపక్షాలకు అనవసర అవకాశం కల్పించడం వల్ల మనకు నష్టం జరుగుతుందన్న విషయాన్ని గ్రహించాలని సూచించారు. ప్రతిపక్షాలకు ఎలాంటి అంశాలు లేవని, అలాంటి సమయంలో మనం చేసే చిన్న తప్పిదాలు ఇబ్బందులు సృష్టిస్తాయని అన్నట్లు తెలిసింది. గురువారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో గురుకులాల్లో అవినీతి, అప్పులపై బీఆర్‌ఎస్ పార్టీతో జరిగిన సవాళ్ల అంశం చర్చకు వచ్చిన సందర్బంగా ఆయన పైవ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం గన్‌పార్క్, తెలంగాణ భవన్ వేదికగా గురువారం జరిగిన పరిణామాలను రేవంత్ ప్రస్తావించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ అంశంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. మంత్రి జూపల్లి బీఆర్‌ఎస్ ఆఫీసుకు వచ్చి చర్చిస్తానని అని ఉండాల్సింది కాదని, అలా చెప్పేటప్పుడు తనకు ఒకసారి విషయం చెప్పాలి కదా అని సీఎం వ్యాఖ్యానించారు. ఒకవేళ అంటే కట్టుబడి ఉండాల్సిందని అన్నట్టు సమాచారం. గన్ పార్క్‌కు వెళ్లిన ముగ్గురు మంత్రులు అడ్లూరి, పొన్నం, అజారుద్దీన్ కూడా కొంతసేపు అక్కడే వేచి ఉండాల్సిందని అన్నట్టు తెలిసింది. భవిష్యత్తులో రాజకీయ వ్యూహాల అమలులో సమన్వయంతో వ్యవహారించాలని రేవంత్‌రెడ్డి మంత్రులకు సూచించారు.
రేవంత్ షి‘కారు’
సాక్షి, హైదరాబాద్: సచివాలయంలో గురువారం రాత్రి సరదా సన్నివేశం జరిగింది. కేబినెట్ సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఓ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని డ్రైవ్ చేశారు. సచివాలయం లోపల తన సహచర మంత్రులను కూర్చోబెట్టుకుని కారులో చక్కర్లు కొట్టారు.


