రేవంత్‌ జైలు పాలయ్యే రోజు దగ్గరలోనే ఉంది 

Minister Vemula And Indrakaran Reddy Made Harsh Remarks On Revanth Reddy - Sakshi

చంద్రబాబు మేనేజ్‌మెంట్‌తోనే ఆయనకు టీపీసీసీ అధ్యక్ష పదవి 

రేవంత్‌ రెడ్డి ఓ బుడ్డరఖాన్‌.. డ్రామా ఆర్టిస్టు 

రేవంత్‌పై మంత్రులు వేముల, ఇంద్రకరణ్‌ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

సాక్షి, హైదరాబాద్‌: ‘ఓటుకు నోటు కేసులో కొద్ది రోజులు జైలుకు పోయిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి శాశ్వతంగా జైలుకు పోయే రోజు దగ్గరలోనే ఉంది. రేవంత్‌వి బుడ్డరఖాన్‌ మాటలు. కాంగ్రెస్‌ డ్రామా కంపెనీ, ఆయన అందులో ఓ డ్రామా ఆర్టిస్టు. సమైక్యవాదుల పంజరంలో చిలుక రేవంత్‌.. వాళ్లు చెప్పేదే పలుకుతారు. చంద్రబాబు మేనేజ్‌మెంట్‌తోనే టీపీసీసీ అధ్యక్షుడు అయ్యారు. హుజూరాబాద్‌లో ఓడితే టీపీసీసీ అధ్యక్ష పదవి పోతుం దని ఆ పార్టీ నేతలే చెప్తున్నారు’అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగ కాంతారావు, జి.విఠల్‌రెడ్డి, మాజీ ఎంపీ గెడాం నగేశ్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి  మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.

1981లో ఇంద్రవెల్లిలో ఆదివాసీలను కాల్చిచంపిన కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు ఆదివాసీలకు స్మారక స్తూపం కడతా మని ప్రకటించడం విడ్డూరంగా ఉందని ప్రశాంత్‌రెడ్డి అన్నారు. పూటకో పార్టీ మార్చిన రేవంత్‌ను కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ఎలా నమ్ముతారని, సోనియాని బలిదేవతగా రేవంత్‌ గతంలో అభివర్ణించిన విషయాన్ని గుర్తు చేశారు. ‘నా మీద వ్యక్తిగతంగా మాట్లాడితే నాలుక తెగ్గోస్తా అని గతంలోనే హెచ్చరించినా రేవంత్‌ భాష మారడం లేదు. మరో 25 ఏళ్లు టీఆర్‌ఎస్‌ అధికారంలో ఉంటుంది. పోడు భూములపై కేసీఆర్‌ త్వరలో నిర్ణయం తీసుకుంటార’ని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.

మేమూ తిట్టడం మొదలు పెడితే..! 
‘ఆర్‌టీఐ రెడ్డిగా పేరొందిన రేవంత్‌ సమాచార హక్కు చట్టాన్ని అడ్డుపెట్టుకుని అక్రమంగా సంపాదించారు. భూమికి జానెడు లేవు.. బిడ్డా మేము తిట్టడం మొదలుపెడితే ఉరేసుకుని చస్తావ్, ద మ్ముంటే హుజూరాబాద్‌లో ఏదైనా మండల ఇన్‌చార్జిగా బాధ్యతలు తీసుకో, ఎవరు గెలుస్తారో చూ ద్దాం’అని ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు సవాల్‌ చేశారు. ‘కాంగ్రెస్‌ నేతలు ఇంద్రవెల్లిలో సభ పెట్టి పుండుమీద కారం చల్లారు. ఆదివాసీలతో చెలగాటం ప్రమాదకరం, విల్లు ఎక్కుపెడితే కోలుకోలేవు. ఒక్క సభతోనే రేవంత్‌ రెచ్చిపోతున్నాడు. టీఆర్‌ఎస్‌ ఇలాంటి సభలు వందలు పెట్టి ఉంటుంది. దళితబంధు ఆట ఇప్పుడే మొదలైంది క్లైమాక్స్‌ మిగిలే ఉంది’అని ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు అన్నారు. ఇంద్రవెల్లిలో కాంగ్రెస్‌ సభ జరిగిన చోట ఆదివాసీలు శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారని, తెలంగాణ వచ్చిన తర్వాతే ఆదివాసీల బతుకులు బాగుపడ్డాయని మాజీ ఎంపీ జి.నగేశ్‌ చెప్పారు. 

బ్లాక్‌మెయిలర్లకు బ్రాండ్‌ అంబాసిడర్‌ 
‘బ్లాక్‌మెయిలర్లకు బ్రాండ్‌ అంబాసిడర్‌ రేవంత్‌రెడ్డి, చంచల్‌గూడలో ఖైదీనంబరు 1779, చర్లపల్లిలో 4170. టీపీసీసీ అధ్యక్షుడు కాగానే రేవం త్‌కు వసూళ్లు పెరిగాయి, తమను వేధిస్తున్నారని బిల్డర్లు ఫిర్యాదు చేస్తున్నార’ని పబ్లిక్‌ అండర్‌టేకింగ్స్‌ కమిటీ చైర్మన్‌ ఏ.జీవన్‌రెడ్డి అన్నారు. ‘తెలంగాణకు రేవంత్‌ ముఖ్యమంత్రి కాదు కదా కనీసం చప్రాసీ కూడా కాలేరు. తాను జైలుకు వెళ్లివచ్చి అందరూ జైల్లో ఉండాలని కోరుకుంటున్నారు. రేవంత్‌ అధికారం గురించి కలలు కనడం మానేయాలి. కాంగ్రెస్‌ పార్టీని రేవంత్‌ భూస్థాపితం చేస్తారు’అని జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top